టాలీవుడ్ బెస్ట్ హీరో పవన్

టాప్ హీరోలు అరడజను మంది వరకు వున్నారు. కానీ వారిలో ఎవరు బెస్ట్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఏ హీరో అయినా డబ్బులు పెట్టుబడి పెట్టే…

టాప్ హీరోలు అరడజను మంది వరకు వున్నారు. కానీ వారిలో ఎవరు బెస్ట్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఏ హీరో అయినా డబ్బులు పెట్టుబడి పెట్టే నిర్మాత గురించి ఆలోచించాలి. తను యాభై కోట్లో, అరవై కోట్లో రెమ్యూనిరేషన్ తీసుకుంటే సరిపోదు. నిర్మాత సంగతి కూడా చూడాలి. ఆ లెక్కలో చూసుకుంటే పవర్ ఫస్ట్ ప్లేస్ లో వుంటారు.

వకీల్ సాబ్ సంగతే చూడండి. మరే హీరో అయినా ఆ సినిమా స్టార్ కాస్ట్ అలా వుండదు. హీరోల డిమాండ్ లు, సిఫార్సులు ఓ రేంజ్ లో వుంటాయి. పది నిమషాల పాత్రకు కూడా తమకు ఫలానా హీరోయిన్ కావాలంటారు. అలాగే సినిమాలో అతి చిన్న పాత్రకు కూడా ఓ రేంజ్ ఆర్టిస్టులు కావాలంటారు. 

కానీ పవన్ అవేమీ పట్టించుకోలేదు. సినిమాలో ఇటు ప్రకాష్ రాజ్ అటు పవన్ వుండే కోర్టులో జడ్జ్ పాత్రకు ముక్కు మొహం తెలియని నటుడిని తెచ్చినా ఆయన ఇదేంటీ అని అడగలేదు. కీలకమైన ముగ్గురు హీరోయిన్ల పాత్రలకు స్టార్ హీరోయిన్లు కావాలని అడగలేదు. అలాగే సినిమాలో మిగిలిన స్టార్ కాస్ట్ ను కూడా పవన్ అస్సలు సజెస్ట్ చేయలేదు.

పవన్ ఇలా మంచిగా వ్యవహరించడం వల్ల నిర్మాత దిల్ రాజుకు కనీసంలో కనీసం ఓ మూడు కోట్లు అయినా ఆదా అయి వుంటాయి. అలాగే సినిమాను మాంచి లోకేషన్లలో భారీగా తీయడం కానీ, లేదా కోర్టు సెట్ ను మాంచిగా వేయడంలో కూడా పవన్ అస్సలు పట్టించుకోలేదు. దాని వల్ల కూడా మరి కొన్ని కోట్లు ఆదా అయ్యాయి.

ఇదే సినిమా త్రివిక్రమ్ తీసి వుంటే కనీసం బడ్జెట్ లో మరో ఇరవై కోట్లు పెరిగి వుండేది. పవన్ కాబట్టి, దిల్ రాజు క్షేమం చూసారు. సినిమాను అతి తక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఫినిష్ చేసారని కామెంట్లు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి హీరోలు ఇలాగే వుండాలి. నిర్మాతకు ఓ రూపాయి మిగిలేలా చూడాలి.

అంతే తప్ప తామే స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ రికమెండ్ చేయడం, తామే ఎవరికి ఎంతెంత ఇవ్వాలో చీటీలు రాసి పంపడం, నిర్మాతకు ఇంకా డబ్బులు మిగుల్తున్నాయి అని అనిపిస్తే, అదనపు ఖర్చులు పెంచడం చేయకూడదు. ఆ విషయంలో పవన్ ముమ్మాటికీ నిర్మాతల హీరో. 

కానీ ఎటొచ్చీ పవన్ తో సమస్య ఒకటే ఎప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అంటారో తెలియదు. ఆయన మూడ్, ఆయన వర్క్ ఫ్రెషర్ బట్టి వుంటుంది. అజ్ఞాతవాసి కి ఆ సమస్య ఎదురైంది. వకీల్ సాబ్ కు ఎదురైందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.