వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా చేయబోతున్నారా..?

ఎమ్మెల్యే రోజా రాజీనామా చేస్తానని అన్నారనే వార్త ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా రోజా ఆ మాట అన్నారా..? జగన్ ని కాదని ఆమె వైసీపీ నుంచి…

ఎమ్మెల్యే రోజా రాజీనామా చేస్తానని అన్నారనే వార్త ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా రోజా ఆ మాట అన్నారా..? జగన్ ని కాదని ఆమె వైసీపీ నుంచి బయటకు వెళ్లగలరా..? జగన్ ని తన సొంత సోదరుడిలా భావిస్తానని చెప్పే రోజా.. ఇప్పుడు పార్టీని ధిక్కరించగలరా..? ఈ ప్రశ్నలు వైసీపీ నేతల్ని వేధిస్తున్నాయి.

రోజాకి కోపం ఎందుకొచ్చింది..?

నగరి నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఐదుగురు నాయకులు రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. గతంలో రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. ఆయా ప్రాంతాల్లో వైసీపీ నాయకులు రోజా ఓటమి కోసం ప్రయత్నించారనేది ఆమె ఆరోపణ. వారి వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారనే అనుమానం కూడా రోజా తరచూ వ్యక్తం చేస్తుంటారు. 

రోజా ఆరోపణలుకు చాలా సార్లు రుజువులు కూడా దొరికాయి. స్థానిక ఎన్నికల్లో చక్రపాణి రెడ్డి.. రోజాకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఆమె సూచించిన అభ్యర్థికి పోటీగా ఎంపీపీగా తమ సోదరుడిని బరిలో దింపడం.. ఇలా వరుసగా రోజాకు తలనొప్పులు తెచ్చిపెట్టారు. కానీ అధిష్టానం చూసీ చూడనట్టే ఉంది.

తాజాగా ఈ గొడవ మళ్లీ ముదిరింది. శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా చక్రపాణిరెడ్డికి ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వడాన్ని రోజా తప్పుపడుతున్నారు. తన వ్యతిరేక వర్గాన్ని ప్రభుత్వంలోని పెద్దలే పెంచి పోషిస్తున్నారని అంటున్నారు. దీనికి నిరసనగా రోజా రాజీనామా చేయబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.

మంత్రి పెద్దిరెడ్డే కారణమా..?

రోజా ఆరోపణల ప్రకారం చక్రపాణి రెడ్డికి దక్కిన ప్రాధాన్యానికి కారణం మంత్రి పెద్దిరెడ్డి. నగరిలో తన ప్రత్యర్థి వర్గాన్ని పెంచి పోషిస్తున్నారనేది ఆమె అభియోగం. అదిప్పుడు మరోసారి రుజవైంది కూడా. రోజా రాజీనామా చేసి తనపై గెలవాలని గతంలో చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు కూడా. 

అలాంటిది చక్రపాణిరెడ్డికి మరోసారి ట్రస్ట్ బోర్డ్ పదవి ఇవ్వడం వివాదాలకు తావిచ్చినట్టైంది. దీంతో రోజా రాజీనామాస్త్రాన్ని బయటకు తీశారని, చక్రపాణి రెడ్డి సవాల్ ని స్వీకరించడానికి సిద్ధపడ్డారని అంటున్నారు. అయితే నేరుగా రోజా ఈ వ్యాఖ్యల్ని చేయలేదు కాబట్టి, అధిష్టానం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.