ప్రత్యేక హోదా.. మరోసారి ప్రచారాస్త్రం కాబోతోందా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై ప్రతిసారీ పోరాటాలు జరుగుతున్నా, అవి కేవలం వైసీపీ ఆరాటాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కనీసం గుర్తించలేదనే చెప్పాలి.…

వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై ప్రతిసారీ పోరాటాలు జరుగుతున్నా, అవి కేవలం వైసీపీ ఆరాటాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కనీసం గుర్తించలేదనే చెప్పాలి. అయితే ఈసారి కాస్త గట్టిగా విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రం అన్యాయం చేసిందన్నారు. జగన్ 7సార్లు ప్రధానికి లేఖలు రాసినా ఫలితం లేదని మండిపడ్డారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఊహించని విధంగా విజయసాయి వ్యాఖ్యల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ రియాక్షన్ వచ్చింది.

ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా అంశాన్ని తొక్కిపట్టిన మోదీ.. తొలిసారిగా తప్పు కాంగ్రెస్ పై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఊహించని విధంగా ప్రధాని మోదీ, రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తారు. తమదేం తప్పులేనట్టు.. తప్పంతా కాంగ్రెస్ పార్టీదే అన్నట్టు విభజన పాపాన్ని కాంగ్రెస్ నెత్తిన రుద్దే ప్రయత్నం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉందనే విషయాన్ని పరోక్షంగా చెబుతూ మొసలి కన్నీరు కార్చారు. చీకట్లో విభజించారని, పెప్పర్ స్ప్రే చేశారని లాజిక్ లేకుండా మాట్లాడారు. సోనియా అమ్మ అయితే, సుష్మా చిన్నమ్మ అనే విషయాన్ని మోదీ పూర్తిగా మరిచిపోయినట్టున్నారు.

పోనీ విభజన పాపం కాంగ్రెస్ దే, కానీ ఎనిమిదేళ్లుగా ఆ పాపాన్ని మోస్తోంది బీజేపీ కాదా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ పార్టీ నేతలు. ఇప్పటికీ తప్పు కాంగ్రెస్ దే నంటూ తమ చేతికి మట్టి అంటనట్టుగా ప్రవర్తిస్తోన్న మోదీపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు, అప్పట్లో బీజేపీ తరఫున రాష్ట్ర విభజన కోసం చేసిన ప్రయత్నాలు, ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తున్నారు. వెళ్లి ఒకసారి వెంకయ్యనాయుడుతో సమావేశమవ్వాలని సూచిస్తున్నారు.

2024 ఎన్నికలకు ఇదే ప్రధాన అస్త్రం..

2024 ఏపీ ఎన్నికల్లో జగన్ ని టార్గెట్ చేయాలంటే ప్రతిపక్షాల వద్ద ప్రధాన అస్త్రాలేవీ లేవు. తాజాగా ఇప్పుడు విభజన విషయాన్ని మోదీ తెరపైకి తెచ్చారు. మరోవైపు ఎల్లో మీడియా, ఇప్పుడిప్పుడే ప్రత్యేక హోదా కథనాలను తెరపైకి తెస్తోంది. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ఏం చేయలేకపోయారని, మూడేళ్లయినా హోదాపై అతీగతీ లేదంటూ కడుపుమంట కథనాలు వండివారుస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. రాబోయే ఎన్నికల కోసం ప్రత్యేక హోదా మంటను మరోసారి రగల్చడానికి అన్ని పార్టీలు సిద్ధమౌతున్నాయనే విషయం అర్థమవుతోంది.

తన హయాంలో బాబు, అధికారం వచ్చిన కొత్తలో హోదా అన్నారు, తర్వాత ప్యాకేజీకి లొంగారు, సరిగ్గా ఎన్నికల టైమ్ లో మళ్లీ హోదా అంటూ యూటర్న్ తీసుకున్నారు. అది జగన్ కు అనుకూలంగా మారింది. ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదాని తెరపైకి తెస్తోందా..? కూటమిని గెలిపిస్తే బీజేపీతో ప్రత్యేక హోదా ఇప్పిస్తామని జనసేనాని స్టేట్ మెంట్ ఇస్తారా..? మధ్యలో టీడీపీ గోతికాడ నక్కలా ఏం చేస్తుంది? 2019లో ప్రత్యేక హోదా అంశాన్ని సక్సెస్ ఫుల్ గా క్యాష్ చేసుకున్న వైసీలీ, 2024లో దాన్ని ఎలా వాడుకోబోతోంది? రాష్ట్రాన్ని విభజించి భూస్థాపితమైన కాంగ్రెస్ ఏం చేయబోతోంది?

2024లో స్పెషల్ స్టేటస్ సెగను ఏ పార్టీ ఎలా ఎగదోయబోతోందో చూడాలి. మొత్తమ్మీద సరిగ్గా ఎన్నికలకు రెండేళ్ల ముందు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చి, రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ పాలిటిక్స్ ను షురూ చేశాయనే చెప్పాలి.