వైఎస్ షర్మిల తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఈ పార్టీ కార్యకలాపాలు కొంతకాలంగా బాగా చురుగ్గా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆమె తెలంగాణ పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో తిరుగుతున్నారు కూడా. పార్టీ పెట్టిన తొలినాటినుంచి షర్మిల, తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్, కేటీఆర్ మీద ఒక రేంజిలో విమర్శల దాడి చేస్తూనే వస్తున్నారు.
అయితే ఇన్నాళ్లుగా తెరాస ఎన్నడూ షర్మిల రాజకీయ అస్తిత్వాన్ని, విమర్శలను పట్టించుకున్నట్టుగా కనిపించనే లేదు. కానీ తాజా పరిణామాలను గమనిస్తోంటే.. షర్మిల రాజకీయ ప్రస్థానం చూసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భయపడుతున్నదా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
షర్మిల ప్రస్తుతం తెలంగాణ పాదయాత్రలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో యాత్ర సాగుతున్న సందర్భంగా.. షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి చెందిన వారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ దాడి తీవ్ర రూపం దాల్చి, వైఎస్సార్ టీపీ కార్యకర్త గొంతు చుట్టూ తాడు బిగించి హత్యాప్రయత్నానికి కూడా పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. ఈ దాడి వెనుక.. భయపెట్టడం ద్వారా.. షర్మిల పాదయాత్రను అడ్డుకోవాలనేదే అధికార టీఆర్ఎస్ లక్ష్యం అయితే గనుక.. వారు షర్మిల పాదయాత్రకు భయపడుతున్నారనే అనుకోవాల్సి వస్తుంది.
షర్మిల తన రాజకీయ పార్టీని ప్రారంభించిన నాటినుంచి.. గులాబీ దళపతిపై స్ట్రెయిట్ ఎటాక్ కు దిగుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి.. పెద్దదొరా చిన్నదొరా అని వ్యవహరిస్తూ ఆమె చాలా తీవ్రమైన విమర్శలే చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ పాలన, నిర్ణయాలు, వ్యవహారాలు అన్నింటి మీద చాలా సీరియస్ గా ట్వీట్లు కూడా పెడుతున్నారు.
ఇన్ని జరుగుతున్నప్పటికీ.. ఎన్నడూ టీఆర్ఎస్ శ్రేణులు షర్మిలను పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. మంత్రులు, ఆపై స్థాయి వారు ఆమె రాజకీయ ప్రస్థానం గురించి ఎన్నడూ వ్యతిరేక కామెంట్లు చేయడం లాంటిది జరగలేదు.
టీఆర్ఎస్ బహుశా వ్యూహాత్మకంగా ఆమె అస్తిత్వాన్ని గుర్తించకుండా వదిలేసి.. తద్వారా.. ఆమెకు తెలంగాణ పెద్ద సీన్ లేదని సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తున్నదా అనే అభిప్రాయాలు కూడా ప్రజలకు కలిగాయి. కానీ తాజాగా టీఆర్ఎస్ కార్యకర్త దాడికి దిగడం, దానికి సంబంధించిన రగడ భిన్నమైన సంకేతాలు ఇస్తున్నాయి.
వైఎస్సార్టీపీ పార్టీ కార్యకర్తపై తాళ్లపల్లి శ్రావణ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త కత్తితో దాడికి దిగి, గొంతుచుట్టూ తాడు బిగించి హత్యకు ప్రయత్నించారనేది ఆరోపణ. సదరు శ్రావణ్ గతంలో కాంగ్రెస్ లో ఉంటూ, తర్వాత టీఆర్ఎస్ లోకి మారాడు. గతంలో వార్డుమెంబరుగా కూడా పోటీచేశాడు. తన ప్రజాప్రస్థానయాత్రలో భాగంగా భువనగిరిలో భారీ బహిరంగసభకు షర్మిల ప్లాన్ చేసిన నాటికి రెండు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.
ఇలాంటి బెదిరింపులతో తమ పార్టీని అడ్డుకోలేరని షర్మిల మరింత ఘాటుగా చెబుతున్నారు. గులాబీ కార్యకర్త చేసిన ఈ దాడి, రాజకీయ ప్రతిఘటనే అయితే మాత్రం.. షర్మిల పార్టీని చూసి టీఆర్ఎస్ జడుసుకుంటున్నట్టే అనుకోవాలి.
టీఆర్ఎస్ కు అసలే పరిస్థితులు విషమిస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్ లను మాత్రమే ప్రత్యర్థులుగా గుర్తించినట్టుగా ఇన్నాళ్లూ వారు వ్యవహరించారు గానీ.. ఇప్పుడు షర్మిల అస్తిత్వానికి కూడా జడుసుకుంటున్నట్టున్నారు.