ఐటీ దాడులతో తమ పార్టీకి, చంద్రబాబుకు సంబంధం ఏంటి అని ఆ పార్టీ సినియర్ నేత యనమల రామకృష్ణుడు, బోండా ఉమా తదితరులు గట్టి ప్రశ్నిస్తున్నారు. యనమల మాట్లాడుతూ చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై ఐటీ దాడులు పార్టీకి సంబంధం లేనివన్నారు. అవి పూర్తిగా శ్రీనివాస్ వ్యక్తిగతమని పేర్కొన్నారు. గత 40 ఏళ్లలో చంద్రబాబు దగ్గర 15 మంది పీఎస్‌లు, పీఏలు పనిచేశారని.. మాజీ పీఎస్‌పై దాడులు జరిగితే పార్టీకి అంటగట్టడం హేయమన్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించు కోడానికే ఎదుటివాళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తనంత మేధావి భూమ్మీద లేడనే రీతిలో మాట్లాడుతుంటారని వైసీపీ మంత్రి కన్నబాబు గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. యనమల మేధావితనాన్ని భరించలేకే ఆయన్ను అసెంబ్లీకి ప్రజలు ఎన్నుకోవడం మానేశారు. ఐటీ దాడులతో తమ పార్టీకి సంబంధం ఏంటని అమాయకంగా ప్రశ్నిస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఐటీ దాడులకు, టీడీపీకి సంబంధం ఉందని చెప్పేందుకు పెద్ద పరిశోధనలు అవసరం లేదు. చిన్నచిన్న ఉదాహరణలతోనే నిర్ధారించవచ్చు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఆ వార్తకు ఇచ్చిన ప్రాధాన్యతే….అది ఎవరికి సంబంధించిందో చెప్పకనే చెబుతుంది. ఐటీ దాడులకు సంబంధించిన వివరాలను ఆ శాఖ ఢిల్లీ అధికారి గురువారం మీడియాకు వెల్లడించారు. అందులో చాలా స్పష్టంగా ఒక ప్రముఖ వ్యక్తి పీఎస్ ఇంట్లో సోదాలు నిర్వహించగా….ఫలానా, ఫలానా విషయాలు బయటపడ్డాయని ప్రకటించారు. అలాగే ఎంత డబ్బు, నగలు తదితర వివరాలను కూడా వివరించారు.
మరి ఈ వార్తకు సంబంధించి నెట్ పేజీల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక ప్రముఖ వ్యక్తి మాజీ పీఎస్ అంటే చంద్రబాబు కావడం వల్లే కదా మీరు సత్యాన్ని సమాధి చేయాలనుకుంది. అలాగే ఆరు రోజుల పాటు చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ, ఈడీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తే ఎందుకు నామమాత్రంగా కూడా వార్తలు రాయలేదు. ఇదే జగన్‌కు సంబంధించి జరిగి ఉంటే ఎలా వండివార్చే వారో తెలుగు ప్రజలకు బాగా తెలుసు.
చంద్రబాబు రాజకీయ భవిష్యత్‌కు ఐటీ రూపంలో ఉరితాడు బిగుస్తున్నారనే భయం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో స్పష్టంగా కనిపిస్తోంది కదా? ఆదాయపు పన్నుశాఖ విడుదల చేసిన ప్రకటనపై ఏబీఎస్, ఈటీవీ చానళ్లలో ఎందుకు చర్చ పెట్టలేదు. చంద్రబాబుకు సంబంధం ఉండటం వల్లే కదా? ప‌్రతి దానికి మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు…తన మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ సోదాలపై ఇంత వరకూ ఎందుకు నోరు మెదపడం లేదు. లోకేశ్ ఎందుకు ట్వీట్ చేయలేదు. చంద్రబాబు మాజీ పీఎస్‌గా వేల కోట్ల అవినీతికి పాల్పడితే, ఇక ఆయన అక్రమ సంపాదనకు కారకులైన వాళ్లు ఇంకెంత దోచుకుని ఉండాలి?
యనమల రామకృష్ణుడు అతి తెలివి తేటలు ప్రదర్శించడానికి…ఇదేమీ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన నాటి కాలం కాదు. ఇప్పటికైనా యనమలతో పాటు ఇతర నాయకులు బాబుకు సర్ది చెప్పి నిజాలను నిర్భయంగా ఐటీ అధికారులకు చెప్పి, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిది.