నమ్మితేనే మోసపోతారని చెబుతారు. ఒక వ్యక్తితో స్నేహం చేయడానికి ముందు చాలా ఆలోచించాలి. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. స్నేహం చేసి లేదా ప్రేమించి…ఆ తర్వాత అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం…మోసపోయాం కుయ్యోమొర్రో అంటూ పట్టించుకునే వాళ్లెవరూ ఉండరు. అంతే కాదు, తిరిగి మనల్నే తప్పు పడతారు.
ఇప్పుడు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటి సనాఖాన్ కూడా తాను మోసపోయానని లబోదిబోమంటోంది. కొరియోగ్రాఫర్ మెల్విన్లూయిస్తో ఆమె నిన్నమొన్నటి వరకు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే తన బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కు గుడ్‌బై చెప్పిన సనా…ఇప్పుడు అతని గురించి కథలుకథలుగా చెబుతోంది.
మెల్విన్ లూయిస్ మోసానికి గురైన యువతుల్లో తన సంఖ్య ఏంటో చెప్పడం కష్టమని వాపోతోంది. చాలా మంది మహిళలను అతను మోసగించాడని, అతను పచ్చి మోసగాడని ఆమె ఆరోపిస్తోంది. అయితే తను అందరి ఆడపిల్లల్లా కాదని, నిజాన్ని నిర్భయంగా చెబుతానని పేర్కొంది. వాస్తవం చెప్పడానికి ధైర్యం కావాలని, అది తన దగ్గర ఉందని చెప్పింది.
మెల్విన్‌ను తాను గుడ్డిగా నమ్మానని, కాని అతను పెద్ద మోసగాడని తెలుసుకున్నానని సనా ఆరోపించింది. తనను వివాహం చేసుకొని పిల్లలు కనాలని మెల్విన్ కోరుకున్నాడని తెలిపింది. అమ్మాయిలను మోసం చేసే మెల్విన్ తన పిల్లలకు ఏం నేర్పుతాడు అని సనా ప్రశ్నించడం కొసమెరుపు.