గత రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేశ్‌లకు అత్యంత సన్నిహితుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఆదాయపు పన్నులశాఖ పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను ఆదాయపు పన్నులశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఐటీ దాడులపై టీడీపీ నేతలెవరూ నోరెత్తడానికి సాహసం చేయడం లేదు.
ఇదే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నాటి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించిన సందర్భంలో చేసిన యాగీ అంతాఇంతా కాదు. అప్పట్లో అధికారులను ఇంటిలోకి రాకుండా సీఎం రమేష్ అడ్డుకున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఏమైంది? మోడీ సర్కార్ కక్షపూరిత దాడులు చేయిస్తోందని ఎందుకు విమర్శించలేకపోతోంది?
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దాదాపు పదేళ్ల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాస్, లోకేశ్ సన్నిహితుడు, కుటుంబ వ్యాపార సంస్థ నిర్వాణ హోల్డింగ్స్ డైరెక్టర్ కిలారు రాజేష్, వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన ఆర్కే ఇన్‌ఫ్రా, సబ్ కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శర్‌త్‌కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రాలలో గురువారం ఉదయం ఏకకాలంలో ఐటీ అధికారుల బృందాలు దాడులు ప్రారంభించాయి.
శుక్రవారం కూడా కొనసాగిన ఈ సోదాల్లో ఐటీ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారని తెలుస్తోంది. ఎలాంటి పనులు చేయకుండానే కాంట్రాక్టు సంస్థల నుంచి బిల్లుల రూపంలో కమీషన్లు వసూలు చేశారనేందుకు ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఐటీతో పాటు జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం కూడా రంగంలోకి దిగి కూపీ లాగడం టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఏమీ లేకుండా రెండ్రోజుల పాటు సోదాలు ఎందుకు జరుపుతున్నట్టు? పేరుకు పైన పేర్కొన్న వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో సోదాలు అన్నమాటే కానీ, కేవలం వీరంతా తీగలేనని, అసలు డొంక కదిలిందనే వాదన బలపడుతోంది. ముంబైలో ఓ బడా కాంట్రాక్టర్ సంస్థ కార్యాలయాల్లో ఐటీ సోదాల్లో మన రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతకు రూ.150 కోట్లకు పైగా ముడుపులు అందించిన విషయం ఐటీ సోదాల్లో బయటపడింది. ఈ విషయాన్ని ఐటీ అధికారులు అధికారికంగానే వెల్లడించారు. ఆ ముడపుల స్వీకర్తలు మన రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ‘పెద్ద’ తలకాయలే అని విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
ఇదే జగన్ సర్కార్ ఏదైనా చేసి ఉంటే…ప్రతిపక్ష టీడీపీ మీడియాను అడ్డుపెట్టుకుని అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నించి ఉండేది. కానీ కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున ఐటీ దాడులు చేస్తుంటే…ఎందుకు మాట్లాడటం లేదనేది ప్రశ్నగా మిగిలింది. నోరు తెరిస్తే, ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందోననే భయమే వారిని కట్టడి చేస్తున్నట్టు సమాచారం. కానీ మోడీ సర్కార్‌పై టీడీపీ నాయకులు అంతర్గతంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఓ పథకం ప్రకారం టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు మోడీ -అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ నాయకత్వం పావులు కదుపుతున్నట్టు అనుమానిస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుని బీజేపీని ఓడించి తీరుతామంటూ దేశ వ్యాప్తంగా హల్‌చల్ చేసిన విషయాన్ని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు మరిచిపోలేందంటున్నారు. ప్రస్తుత పరిణామాలను చంద్రబాబు ఊహించే….బీజేపీకి దగ్గరయ్యేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా అటు వైపు నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. దేవుడికైనా దెబ్బే గురువు అన్నట్టు….టీడీపీకి మరీ ముఖ్యంగా చంద్రబాబుకు మోడీనే సరైన గురువు అనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే టీడీపీ భవిష్యత్ ఏంటో చెప్పడం కష్టమంటున్నారు. మొత్తానికి ఐటీ దాడులతో టీడీపీలో వణుకు మొదలైంది.