టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది. విద్యా వ్యాపారంలో కోట్లు గడిస్తున్నా.. వాటితో ఈ లోటు పూడ్చుకోలేని పరిస్థితి. అందుకే చేసేదేంలేక రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. నెల్లూరులో వెంచర్లు వేసి, వాటిని అమ్ముకుంటున్నారు నారాయణ.
ఆర్థిక ఇబ్బందులతో పాటు అమరావతి భూముల కుంభకోణం కూడా మెడకు చుట్టుకోవడంతో మాజీ మంత్రి నారాయణ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారని సమాచారం. ఎమ్మెల్సీగా మంత్రి పదవి వెలగబెట్టిన నారాయణ, గత ఎన్నికల్లో ఎందుకో ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చూపించాలనే కోరిక కలిగింది. అందుకే కోట్ల రూపాయల నిధులతో నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు, కాంట్రాక్టర్లే సగం తినేయడం, హడావిడి పనులతో నగరవాసులకు తీవ్ర ఇబ్బంది పడటంతో ఆ ప్లాన్ బెడిసికొట్టింది. నారాయణ నగరాన్ని చెత్తచెత్తగా మార్చేశారన్న అపవాదుతో పాటు, టీడీపీ వ్యతిరేక ఓటు కూడా తోడవడంతో ఆయన కొంప మునిగింది.
ఓట్ల కోసం కుమ్మరించిన సొమ్ము కూడా ఇటీవలే అప్పులిచ్చినవారికి సర్దుబాటు చేసుకున్నారు. అయితే పార్టీకే ఆయన ఇంకా బాకీ ఉన్నారని అంటున్నారు. ఇతరత్రా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులొచ్చినా విద్యాసంస్థల సొమ్ము ముట్టకూడదనే నియమం పెట్టుకున్న నారాయణ, నేటికీ అదే ఫాలో అవుతున్నారు. అందుకే ఎప్పుడూ లేనిది రియల్ వెంచర్లు వేసి అమ్మకాలు ప్రారంభించారు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయంటే ఇదేనేమో..
గతంలో నారాయణ నెల్లూరుకు వస్తున్నారంటే మందీ మార్బలం స్వాగత సత్కారాలు చేసేవి. పర్యటనలకు పదిమంది అధికారులు, ఆయన అభిమాన మహిళా నాయకులు.. అబ్బో పెద్ద వైభోగమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నారాయణ సొంతూరికి కూడా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లొస్తున్నారు. ఎవరికీ కనిపించడం లేదు, ఎక్కడా వినిపించడం లేదు. ఒకరకంగా టీడీపీ అధికారం కోల్పోవడం వల్ల చంద్రబాబు కంటే ఎక్కువ ఇబ్బందుల్లో పడ్డ వ్యక్తి నారాయణే అంటున్నారు పార్టీ కీలక నేతలు.