ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. పింఛన్ల ప్రక్రియ ఒకసారి మొదలైతే ఇక మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు ఏ ప్రభుత్వం. కానీ జగన్ మాత్రం అర్హుల విషయంలో మరోసారి ఆలోచించారు. ఇంకా ఎవరైనా అర్హులు పింఛన్లు అందకుండా మిస్ అయ్యారేమో అనే ఆలోచనతో మరోసారి 10 రోజుల పాటు రీ-వెరిఫికేషన్ కు శ్రీకారం చుట్టారు.
ఈనెల ఒకటవ తేదీ నుంచి పింఛన్ల పంపిణీని ఉద్యమంగా చేపట్టింది వైసీపీ సర్కార్. నవశకం సర్వే ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తోంది. అయితే 4 లక్షల 80వేల మందికి పింఛన్లు అందడం లేదని, అర్హులైనప్పటికీ వాళ్లను కావాలనే తప్పించారని టీడీపీ గగ్గోలు పెడుతోంది. ఇలాంటివి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్ మాత్రం అర్హులకు అన్యాయం జరగకూడదని భావించారు. అందుకే పింఛన్ మిస్ అయిన వాళ్లకు మరోసారి రీ-వెరిఫికేషన్ కల్పిస్తున్నారు.
అన్ని అర్హతలు కలిగి పింఛన్ రాలేదని భావిస్తున్న వారు గ్రామ వాలంటీర్ లేదా సెక్రటరీకి ఆ విషయాన్ని చెప్పొచ్చు. ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఇంటికి వచ్చి అర్హతలు పునః పరిశీలిస్తారు. వెరిఫికేషన్ లో అర్హులైనట్టు తేలితే ఫిబ్రవరి పింఛన్ కూడా కలిపి మార్చిలో అందిస్తారు. ఆ మొత్తాన్ని గ్రామ వాలంటీర్ స్వయంగా అర్హుల ఇంటికే వచ్చి అందిస్తారు.
అర్హులెవరూ మిస్ అవ్వకూడదనే సమున్నత ఆశయంతో జగన్ తీసుకున్న నిర్ణయం ఇది. ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు ఈ రీ-వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే 54 లక్షల 68వేల మంది పింఛన్లు అందుకుంటున్నారు. దీనికోసం 1320 కోట్లు వెచ్చిస్తోంది ప్రభుత్వం. ఈసారి పింఛన్లలో కొత్తగా 6 లక్షల మంది చేరారు. రీ-వెరిఫికేషన్ మొదలైన ఈ తరుణంలో.. ఇకనైనా టీడీపీ పింఛన్లపై లేనిపోని రాద్దాంతం చేయకుండా ఉంటే మంచిది.