హెరిటేజ్ ఫుడ్స్…ఈ సంస్థ ఎవరిదో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులది. ఈ సంస్థను చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు నారా బ్రాహ్మణి నిర్వహిస్తున్నారు. విజయవంతంగా ఓ పరిశ్రమను నడుపుతున్న మహిళా పారిశ్రామికవేత్తలుగా అత్తాకోడళ్లు భువనేశ్వరి, బ్రాహ్మణి పేరు పొందారు.
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో పారిశ్రామిక సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ సంస్థలైతే ఇంటి నుంచే పని చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ (లిమిటెడ్) సంస్థ కూడా తన వంతు బాధ్యతగా రక్షణ చర్యలు చేపట్టింది.
కార్పొరేట్, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి నుంచే (వర్క్ ఫ్రం హోమ్) లేదా రొటేషన్ విధానంలో పనిచేసే వెసలుబాటు కల్పించినట్టు సంస్థ పేర్కొంది. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లలోనూ ఆహార భద్రత చర్యలు చేపట్టామని, ప్లాంట్లలో పనిచేసే కార్మికులను, వాహన సిబ్బందితో సహా ప్రతిరోజూ స్క్రీనింగ్ చేపట్టిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.
కంపెనీలో ప్రతి దశలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హెరిటేజ్ ఉత్పత్తుల డిస్ట్రిబ్యూషన్, డెలివరీలో భద్రత కోసం సేల్స్, డెలివరీ సిబ్బందికి ఫేస్ మాస్క్‌లు, చేతి తొడుగులు, శానిటైజర్లను అందజేసిననట్లు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు.
వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోమ్ డెలివరీ, ఈ-కామర్స్ ద్వారా హెరిటేజ్ పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. కరోనాపై యుద్ధంలో ఉత్తుత్తి మాటలకే పరిమితం కాకుండా…చిత్తశుద్ధితో తమ సిబ్బంది ఆరోగ్య సంబంధిత విషయాలపై పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్న బ్రాహ్మణిని శభాష్ అని ప్రశంసించాల్సిందే.