బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన జాఫర్, ఇప్పుడు టీవీ9 ఛానెల్ నుంచి కూడా ఎలిమినేట్ అయ్యాడు. కొత్త మేనేజ్ మెంట్ అతడ్ని తొలిగించిందా, లేక స్వయంగా జాఫర్ తప్పుకున్నాడా అనే విషయాన్ని పక్కనపెడితే.. టీవీ9కు జాఫర్ కు మధ్య ఉన్న 15 ఏళ్ల అనుబంధం వీగిపోయింది. ఇకపై తనకు టీవీ9కు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా జాఫర్ ఓ వీడియో ద్వారా స్పష్టంచేశాడు.
టీవీ9 ఆఫీస్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. బహిష్కృత సీఈవో రవిప్రకాష్ తో ఇప్పటికీ క్లోజ్ గా ఉంటున్న కారణంగానే జాఫర్ ను కొత్త యాజమాన్యం తొలిగించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా రవిప్రకాష్, జాఫర్ తరచుగా ప్రైవేట్ పార్టీల్లో కలుస్తున్నారట. ఈ విషయాలన్నీ రూఢిగా నిర్థారించుకున్న తర్వాతే జాఫర్ ను సాగనంపినట్టు తెలుస్తోంది.
టీవీ9 కీలక వ్యక్తుల్లో ఒకరు జాఫర్. ఓ సాధారణ జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన జాఫర్, ముఖాముఖి అనే కార్యక్రమంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. 2014 ఎన్నికల టైమ్ లో తమ సొంత ప్రయోజనాల కోసం జాఫర్ తో అప్పటి టీవీ9 యాజమాన్యం ఈ ప్రొగ్రామ్ ను తయారుచేసిందని చెబుతారు. వాళ్లు ఏ ఉద్దేశంతో ఈ “ముఖాముఖి”ని పెట్టారో కానీ, కార్యక్రమం మాత్రం క్లిక్ అయింది. జాఫర్ అడిగే సూటిప్రశ్నలు సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడా కార్యక్రమం అధికారికంగా ఆగిపోయినట్టయింది.
తను టీవీ9 నుంచి బయటకు వచ్చేశానని ప్రకటించుకున్న జాఫర్ ప్రస్తుతానికి మరో ఛానెల్ లో జాయిన్ అయ్యే ఉద్దేశం లేదని స్పష్టంచేశాడు. ఓ నెలరోజుల పాటు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత డిజిటల్ మీడియాలో కొనసాగాలా టీవీ మీడియాలోకి వెళ్లాలా అనే నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. జాఫర్ మాత్రమేకాదు.. రవిప్రకాష్ తో సన్నిహితంగా ఉండే చాలామంది వ్యక్తులు టీవీ9ను వీడారు.
రవిప్రకాష్ కొత్త ఛానెల్ ఎప్పుడు పెడతారా అని వీళ్లంతా ఎదురుచూస్తున్నారు. రవిప్రకాష్ ఛానెల్ తెరపైకి వచ్చిన వెంటనే జాఫర్ తో పాటు వీళ్లంతా అందులో కనిపించడం ఖాయం అంటున్నారు టీవీ జనాలు. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తో ఒకేసారి సౌత్ అంతటా న్యూస్ ఛానెల్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట రవిప్రకాష్.