కర్ణుడి పతనానికి ఆరు కారణాలున్నట్టు మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో దేశంలోనే టాప్ ర్యాంకులో ఉండే జగన్ మోహన్ రెడ్డి అమాంతం 16 వ ర్యాంకులోకి పడడానికి కూడా ఆరు కారణాలున్నాయి.
సంక్షేమ పథకాలిస్తే చాలు ప్రజల మూడ్ ఎప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత వైపు వెళ్లదని నమ్మి ఆరునూరైనా పథకాలు అమలు చేస్తున్నారు జగన్. కానీ ర్యాంక్ చూస్తే ఆశించిన ఫలితాన్ని ప్రతిబింబించడంలేదు.
కొన్ని నెలల క్రితం వరకు ఉన్న ప్రభుత్వానుకూల వాతావరణం ఒక్కసారిగా గత నెల నుంచే రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. కారణాలేంటి? ప్రాంతీయ ఎన్నికల్లో గానీ, తిరుపతి ఉప ఎన్నికలో కానీ ఈషణ్మాత్రమైనా కనిపించని ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడీ ర్యాంకింగ్ లో ఎందుకు కనిపిస్తోంది?
1. తేలని మూడు రాజధానులు: చంద్రబాబు అరచేతిలో ఒక్క అమరావతిని చూపించి కాలక్షేపం చేసారు. జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటనైతే చేసారు కానీ అమలు పరచడంలో జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్నారు. కనీసం వ్యక్తిగతంగా జగన్ మోహన్ రెడ్డి విశాఖ వెళ్లి కూర్చోవడం కానీ, కర్నూలులో ప్రతిపాదిత హై కోర్టు వ్యవహారాలు పరిశీలిస్తున్నట్టుగా పర్యటనలు గానీ లేవు. అసలు మూడు రాజధానుల వ్యవహారం కార్యరూపం దాలుస్తుందా లేక అది ప్రకటనకే పరిమితమా అనే అనుమానాలు ఉత్తరాంధ్ర వాసుల్లోనూ, కోస్తా, సీమ వాసుల్లోనూ విపరీతంగా ఉన్నాయి.
2. ఎవరికీ నచ్చని లిక్కర్ పాలసీ: ఇది కొత్త కథ కాదు. పాతదే. ప్రతిపక్షాలు మొదటే తిరగబడ్డా, ప్రభుత్వ సానుకూల వర్గాలు మాత్రం ఓపిక పట్టాయి. విధానాలని వెనకేసుకొచ్చాయి. రాష్ట్రానికి ఏదో మేలు జరగబోతోందని సహనం వహించాయి. కానీ అలాంటిదేం కనిపించడం లేదు. మందుబాబులకి ఆంధ్రప్రదేశులో సుఖం లేదన్న అభిప్రాయం తన పర బేధం లేకుండా అన్ని వర్గాల్లోనూ పాకింది. మంచి బ్రాండ్స్ లేకుండా కేవలం లోకల్ బ్రాండ్స్ తాగడానికి కొన్ని వర్గాల వాళ్లు నామోషీకూడా ఫీలౌతున్నారు. “నచ్చిన సరుకు తాగితే సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఉంటుంది. అదిప్పుడు లేదు”, అని చాలామంది ఎగువ మధ్య తరగతి వర్గాలవారు అంటున్నారు. గత్యంతరం లేక పక్క రాష్ట్రాల నుంచి పరిమితుల్ని అనుసరించి సీసాలు తెప్పించుకుంటున్నారు.
3. ఇసుక కుంభకోణాలు: ఇసుక మాఫియాని అరికడతానన్నారు జగన్. ఇప్పుడు అరికట్టకపోగా సొంత వార్గాలవాళ్లు ఏ రేంజులో వ్యాపారం చేసుకుంటున్నారో బయటికొస్తున్నా సత్వర ప్రక్షాళణ కార్యక్రమం చేపట్టడం లేదు. నిర్మాణ రంగంలో ఉన్న అందరికీ ఇది ఇబ్బందే. శపథం చేసినప్పుడు అంతు చూడాలి కదా. పట్టనట్లుగా మధ్యలో వదిలేస్తే ఎలా? కఠినమైన చట్టాన్ని అమలు చెయ్యాలి కదా.
4. నిద్రపోతున్న నాయకుల్ని లేపడం: ఎవడో ఒక ఉన్మాది ఒక ఆడపిల్లని హత్య చేసాడు. పోలీసులు వాడిని పట్టుకుని లోపలేసారు. మధ్యలో లోకేష్ వచ్చి ఏదో హడావిడి శవరాజకీయం చేయబోయారు. అతన్ని అరెస్టు చేసి హీరోని చెయ్యడమంటే “నిద్రపోతున్న నాయకుల్ని లేపినట్టే” అన్న సామెతలా ఉంటుంది. ఎందుకంటే లోకేష్ అరెస్టవడానికే గొడవలు చేస్తున్నాడు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏ గొడవా ఉండదు. ఆ వార్త ప్రతిపక్ష సానుకూల మీడియా వరకు ఆగుతుంది. ఇప్పుడు అరెస్టు చేసి అదేదో ఘనకార్యం లాగ ప్రభుత్వ సానుకూల మీడియా కూడా ప్రచారం చేసుకోవడం వల్ల నష్టం ప్రభుత్వానికే. అనవసరంగా ప్రత్యర్థిని పైకి లేపడమే.
5. అమలుకాని సినిమా టికెట్ల జీవో: ఇదొక పెద్ద ప్రహసనం. టికెట్ ధర తగ్గించి, ఇంత కంటే ఎక్కువకి అమ్మడానికి వీల్లేదని బిరడా బిగిస్తూ ఒక జీవో వదిలారు. కానీ ఆ జీవోని అమలు చేసే చట్టమేం చేస్తోంది? పోయిన వారాంతంలో విడుదలైన ఒక సినిమా టికెట్లు యధేచ్ఛగా కుదిరిన రేటుకి అమ్మారు. ఇది ఒక చోట కాదు. దాదాపు రాష్ట్రమంతా ఇంతే. రాయలసీమలో అయితే విచ్చలవిడిగా అమ్మారు. దీని వల్ల విడుదలైన జీవో కి విలువ లేకుండా పోయింది. పోనీ జనం గొడవ పెట్టారా అంటే అదీ లేదు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ట్యాక్స్ రూపంలో అదనపు ఆదాయం రాలేదు. ఇలా తోచిన కాడికి అమ్మి జీవో లో ఉన్న లెక్క ప్రకారం ప్రభుత్వానికి లెక్క చూపిస్తారు థియేటర్ యజమానులు. అంటే బ్లాక్ మార్కెటింగ్ ఓపెన్ గా జరుగుతున్నట్టేగా. ఉన్న పరిస్థితి రిపేరు కాకపోగా మరింత పాడైనట్టు ఉంది వ్యవస్థ. రాష్ట్రానికి, సమాన్యుడికి ఏమాత్రం ప్రయోజనం లేని విధంగా ఉంది జీవొ అమలు తీరు.
6. ప్రభుత్వోద్యోగుల్లో అసంతృప్తి: 2004 కి ముందు చంద్రబాబు ఆకస్మిక తనిఖీల పేరుతో ప్రభుత్వాఫీసుల్లో ప్రత్యక్షమై ఇన్స్పెక్షన్ చేసి ఉద్యోగుల్ని బెదరగొట్టేవారు. ఆ దెబ్బకి ఉద్యోగుల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. 2004 లో చంద్రబాబు ఓడిపోవడానికి దీనిని కూడా ఒక కారణంగా చెప్తారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఇంచు మించు అదే స్టైల్లో మొన్నీమధ్య కలెక్టర్లని జూం మీటింగులో మందలించారు. ఇన్స్పెక్షన్స్ చెయ్యడం లేదని, ఫీల్డ్ వర్క్ కి దూరంగా ఉంటున్నారని మొట్టికాయలేసారు. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నాయకుడు మంచి మాటలతో మోటివేట్ చెయాలి కానీ మ్యానేజర్ లాగ రివ్యూ మీటింగులు పెట్టి చివాట్లు పెట్టకూడదు. ఉద్యోగులతో ఎమోషనల్ కనెక్ట్ పోగొట్టుకునేలా ప్రవర్తించకూడదు. ప్రేమతో పని చేయించుకోవాలి. అది ప్రస్తుతానికి లేదు.
ఇక్కడ ప్రస్తావించినవన్నీ దిద్దుకోదగ్గ తప్పులే. క్వార్టర్లీ పరీక్షల వరకు టాప్ ర్యాంకులో ఉన్న విద్యార్థి హాఫ్-ఇయర్లీ పరీక్షలో 16 వ ర్యాంకుకు వస్తే క్లాస్ టీచర్ చెప్పే సూచనల్లాంటివే ఇవి. అంతే కానీ కేవలం విమర్శ కాదు. ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి తన రాజప్రాసాదాన్ని వదిలి రాస్ట్ర పర్యటన చేస్తే అన్నీ సర్దుకుంటాయి. సమస్యలన్నీ వ్యక్తిగతంగా పరిష్కరించుకోవచ్చు. ప్రజాభిమానంతోనూ, ఉద్యోగుల సహకారంతోనూ మళ్లీ టాప్ ర్యాంకులోకి వెళ్ళొచ్చు. ఇది కేవలం వార్ణింగ్ బెల్ మాత్రమే.
గ్రేట్ ఆంధ్రా బ్యూరో