కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలంటే రక్షణ చర్యలే తప్ప, మరే మందు లేదని వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఒక్క కేసే కదా అని నిర్లక్ష్యం వహించిన దేశాలు …ఆ తర్వాత కాలంలో ఎలా అల్లాడిపోయాయో అందరికీ తెలిసిందే. అయితే న్యూజిలాండ్ మాత్రం ఇందుకు మినహాయింపు. కరోనా కట్టడికి మొదటి నుంచి ఆ దేశం తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి న్యూజిలాండ్ మరోసారి వార్తల్లో నిలిచింది. కేవలం ఒకే ఒక్క కోవిడ్ కేసు నమోదయ్యే సరికి ఆ దేశం అప్రమత్తమైంది. దేశమంతా మూడు రోజులు కఠిన లాక్‌డౌన్‌ను విధించి అబ్బురపరుస్తోంది. అక్లాండ్‌లో ఒక వ్యక్తికి వైరస్ సోకింది.
ఇటీవల దేశంలోని కోరమాండల్ ద్వీపకల్పానికి వెళ్లిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ దేశం వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తి ఉంటున్న అక్లాండ్‌తో పాటు మరొకచోట 7 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
మహమ్మారిని అంతం చేయకపోతే వాటిల్లే నష్టాన్ని భరించలేమని.. అందువల్ల అదుపు చేయడానికి 50 లక్షల దేశ జనాభా కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునివ్వడం మనకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎందుకంటే వేలు, లక్షల కేసులు నమోదవుతున్న సందర్భాల్లో కూడా మన దేశంలో ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోని నిర్లక్ష్యం తెలిసిందే. అలాంటిది కేవలం ఒక కేసు దశలోనే మహమ్మారిని మట్టుపెట్టాలనే న్యూజిలాండ్ స్ఫూర్తి సదా ఆచరణీయం, ప్రశంసనీయం.