జగన్ మన్ను అయితే, చంద్రబాబు దుమ్ము. ఇద్దరూ దొందు దొందే…ఏపీ ప్రజల అభిప్రాయం ఇది. పాలకుడిగా జగన్ గ్రాఫ్‌తో పాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గ్రాఫ్ కూడా పడిపోతుండడం ఏపీలో నెలకున్న విచిత్ర పరిస్థితిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ 26 నెలల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు సాధించిన ఒక్కటంటే ఒక్క విజయం కూడా లేకపోవడం గమనార్హం. ఎంతసేపూ జగన్ ఫెయిల్యూర్స్‌పై చర్చే తప్ప, చంద్రబాబు విజయాలపై సొంత మీడియాలో కూడా చర్చ లేకపోవడం టీడీపీ దౌర్భాగ్యం.
ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ గ్రాఫ్‌లు బాగా దిగజారినట్టు తేలింది. ఈ సర్వే ఇటు వైసీపీ, అటు టీఆర్ఎస్ పార్టీలు అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకతను చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సర్వేకి సంబంధించి జగన్ విషయంలో ఇండియా టుడే కీలక కామెంట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతున్నా జగన్‌కు ప్రజాదరణ తగ్గిపోయిందని ఇండియా టుడే పత్రిక చేసిన కామెంట్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై వైసీపీ లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. జగన్ గ్రాఫ్ పడిపోతుంటే… మరి ఆయన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబుకు ప్రజాదరణ పెరుగుతోందా? ఇప్పుడీ ప్రశ్న ఎక్కడ చూసినా వినిపిస్తోంది. దీనికి లేదనే సమాధానం వస్తోంది.
ముఖ్యంగా చంద్రబాబుకు వయసు పైబడడం నెగెటివ్ అవుతోంది. ఇక ఆయన వల్ల కాదులే అనే అభిప్రాయాలు క్రమంగా బలపడుతున్నాయి. మరోవైపు చంద్రబాబు వారసుడిగా ఆయన తనయుడు లోకేశ్ టీడీపీ శ్రేణులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. లోకేశ్ పరిస్థితి ఒకడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. ఉదాహరణకు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య, అలాగే ఆధిపత్య పోరులో భాగంగా టీడీపీ నేతలు హత్యకు గురైనప్పుడు అక్కడికెళ్లి ఘాటు హెచ్చరికలు చేయడంతో సరిపోతోంది. అంతే తప్ప ఆ తర్వాత దాన్ని అందుపుచ్చుకుని లోకేశ్ ముందుకెళ్లలేక పోతున్నారు.
ఎంత సేపూ సోషల్ మీడియాలో ట్వీట్లతో రాజకీయంగా బలపడాలనే తపనే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లాలనే పట్టుదల కరువైంది. దీంతో లోకేశ్‌ను భవిష్యత్ టీడీపీ రథసారథిగా ఆ పార్టీ శ్రేణులు గుర్తించలేకున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్లు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ లోకేశ్ నాయకత్వ ఫెయిల్యూర్‌గానే చూడాలి.
ఇండియా టుడే సర్వే స్థాయిలో కాకపోయినా జగన్ గ్రాఫ్ పడిపోతోందన్నది వాస్తవం. ఇదే సమయంలో జగన్ ప్రత్యర్థుల గ్రాఫ్ పెరగాలి కదా? ఆ వాతావరణం ఏపీలో అసలు కనిపించడం లేదు. చంద్రబాబు, లోకేశ్ ఇంకా గత పాలసీలనే నమ్ముకుని రాజకీయాలను చేస్తున్నారు. అంటే ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులపై విషం చిమ్మడం ద్వారా, తాము అనుకూలంగా మలుచుకోవాలనే వ్యూహాలనే టీడీపీ అమలు చేస్తోంది. ఇది టీడీపీకి నష్టం తీసుకొస్తోంది.
ఉదాహరణకు అనంతపురం నుంచి కియా పరిశ్రమ తరలిపోతోందని ఎల్లో మీడియా ఏదో రాయడం, దాన్ని అందిపుచ్చుకుని టీడీపీ నానా యాగీ చేయడం తెలిసిందే. చివరికి కియా పరిశ్రమ ఎక్కడికీ వెళ్లలేదని తేలిపోయింది. అలాగే అలాంటిదే మరో తాజా ఘటన….చిత్తూరు నుంచి అమరరాజా పరిశ్రమ తమిళనాడుకు వెళ్లిపోతోందని ప్రచారం. దీనిపై ఎల్లో మీడియా రాయడం, దానిపై టీడీపీ గగ్గోలు పెట్టడం తెలిసిందే.
చివరికి టీడీపీకి చెందిన ఆ పరిశ్రమ యజమాని గల్లా జయదేవ్ మీడియా ముందుకొచ్చి… అమరరాజా తరలింపు వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటివి టీడీపీ విశ్వసనీయతను పాతాళంలోకి నెట్టేస్తున్నాయి. అందువల్లే చంద్రబాబు మాటలను ప్రజలు ఇప్పటికీ నమ్మలేని పరిస్థితి.
జగన్ ప్రభుత్వంపై గోబెల్ ప్రచారం సత్ఫలితాలు ఇవ్వడం లేదని చంద్రబాబు గుర్తిస్తున్నట్టుగా లేరు. పైగా తమకు నష్టం కలిగిస్తోందనే స్పృహ చంద్రబాబులో కొరవడింది. జనం మాత్రం దొందు దొందే అన్నరీతిలో జగన్, చంద్రబాబు-లోకేశ్ నాయక త్వంపై పెదవి విరుస్తున్నారు.
తన గ్రాఫ్ పడిపోతున్నా, లోకేశ్ పుణ్యమా అని చంద్రబాబు గ్రాఫ్ పెరగలేదనే సంతృప్తి ఏపీ ముఖ్యమంత్రికి మిగిలింది. ఈ నేపథ్యంలో రానున్న మూడేళ్లలో తమ పరపతి పెంచుకునేందుకు జగన్, చంద్రబాబు రచించే వ్యూహాలపైనే వారి అధికారాలు ఆధారపడి వుంటాయని చెప్పక తప్పదు.