కరోనా టైమ్ లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలు దోపిడీ జరుగుతుందనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ ఇచ్చినా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించుకున్నా వాళ్లిచ్చేది వేడినీళ్లు, విటమిన్ ట్యాబ్లెట్లు, గుడ్డుతో కూడిన భోజనం. అయినా సరే ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రులకు ఎందుకు పరిగెడుతున్నారు? కేవలం ప్రాణభయమే వారిని బడా ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది.
ఇలాంటి దశలో లక్షలు పెట్టుబడులు పెట్టిన యాజమాన్యాలు, కోట్ల లాభం కళ్లచూడాలని ఎందుకు అనుకోవు. ప్రజల భయాన్ని క్యాష్ చేసుకోడానికి వారికి కరోనా రూపంలో ఓ మార్గం దొరికింది. దాన్ని వాళ్లు బ్రహ్మాండంగా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ లేక, కొవిడ్ కేర్ సెంటర్లు సరిపోక.. ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు కొవిడ్ ట్రీట్ మెంట్ కి అనుమతిచ్చింది. అంతేకాదు, ఫీజులు ఎంత వసూలు చేయాలి, ఆరోగ్యశ్రీ కింద ఎంత మినహాయించుకోవాలనే విషయంపై పూర్తి వివరాలతో జీవో విడుదల చేసింది.
కార్పొరేట్ ఆస్పత్రులకు ఇవేవీ పట్టలేదు. రోజుకి 3250 రూపాయల ఫీజు ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రైవేట్ ఆస్పత్రులు 35వేల రూపాయల నుంచి రేటు ఫిక్స్ చేశాయి. ఇక అవసరాన్ని బట్టి ఆక్సిజన్ సిలిండర్ పెడితే ఓ రేటు, ఐసీయూ అయితే మరో రేటు, వెంటిలేటర్ కి ఇంకో రేటు, ప్లాస్మా ఎక్కిస్తే ఎక్స్ ట్రా చార్జి అంటూ అనధికారికంగా రేట్లు ఫిక్స్ చేశాయి. రూల్స్ మాట్లాడే వాళ్లకి సాధారణ ట్రీట్ మెంట్ ఎలాగూ ఉంటుంది. అక్కడ రోగుల్ని పట్టించుకునేవారే ఉండరు. విటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చి సరిపెడితే ఎవరు దిక్కు.
అందుకే పేషెంట్లు దోపిడీ గురించి తెలిసి కూడా స్పెషల్, డీలక్స్ వార్డులవైపే వెళ్తున్నారు. ఇప్పుడీ దోపిడీ అరికట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కరోన వైద్యం కోసం ప్రభుత్వం నిర్థారించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తూ సీఎం జగన్ హెచ్చరించారు. ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్, ఎస్పీలకు ఫుల్ చార్జ్ ఇచ్చేశారు. అయితే రోగులే ఏరికోరి స్పెషల్ ట్రీట్ మెంట్ కోసం ప్రత్యేకంగా చదివింపులిచ్చుకుంటున్న వేళ, అధికారులు ఎంతవరకు నిఘా పెట్టగలరన్నదే సందేహం.
ప్రాణం మీదకొస్తే ఎవరూ డబ్బులు లెక్కచేయరు, ఆ బలహీనతనే కార్పొరేట్ ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పారు కాబట్టి అధికారులు కఠినంగా ఉండక తప్పదు. జగన్ ఆశయం మంచిదే.. అయితే అది ఆచరణలో సాధ్యమా కాదా అనేది తేలాల్సి ఉంది.