జగన్ ఆశయం మంచిదే కానీ…

రెండునెలలు గడిచాయి. జగన్ పాలనపై అపుడే పెదవి విరుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంట్లో కొంచెం వాస్తవముంది. కొంచెం దుష్ప్రచారముంది. Advertisement (1) ప్రజావేదిక కూల్చడం జగన్ అభిమానులకి కూడా కొందరికి నచ్చలేదు. దీంట్లో జగన్‌కి…

రెండునెలలు గడిచాయి. జగన్ పాలనపై అపుడే పెదవి విరుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంట్లో కొంచెం వాస్తవముంది. కొంచెం దుష్ప్రచారముంది.

(1) ప్రజావేదిక కూల్చడం జగన్ అభిమానులకి కూడా కొందరికి నచ్చలేదు. దీంట్లో జగన్‌కి పోయిందీలేదు. బాబుకి వూడిందీలేదు. అది ప్రజల డబ్బు. అదే కరకట్టపై బోలెడు అక్రమ కట్టడాలు దర్జాగా వుంటే ప్రజలు పన్నులు కడితే వచ్చిన డబ్బుతో దాన్నికట్టారు. దీంట్లో అవినీతి ఎంతనేది వేరే విషయం. దాన్ని కూల్చడం కరెక్ట్ కాదు.

(2) ఇసుక విధానంపై స్పష్టత లేకపోవడం వల్ల రెండు నెలలుగా ఇసుక మాఫియా విజృంభించింది. కూలీలకు పనిలేకుండా పోయింది. ఇది తొందరగా సరిచేసుకుంటే జనం ప్రశాంతంగా ఉంటారు.

(3) అన్న క్యాంటీన్లను మూసివేయడం అవివేకపు చర్య. పేద ప్రజలు చాలా ఆశలతో జగన్‌ని అఖండ మెజారిటీతో గెలిపించారు. ఒకటి రెండు రోజులైనా సరే వాళ్ల నోటికాడ ముద్దతీయడం కరెక్ట్ కాదు. అన్న క్యాంటీన్లన నిర్మాణంతో అవినీతి జరిగిందంటున్నారు. వాటిని కూల్చేసే పని పెట్టుకోకండి. అది కూడా మా డబ్బే. అవినీతిపరుల్ని చట్టంతో శిక్షించండి. అందరూ సంతోషిస్తారు. అయినా చంద్రబాబుది అవినీతి ప్రభుత్వమని గట్టిగా నమ్మడం వల్లే కదా చిత్తుగా ఓడించారు. మళ్లీ ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? చంద్రబాబు అవినీతికి పర్యాయపదం. జనానికి ఇప్పుడు కావాల్సింది బాబు అవినీతిపురాణం కాదు. జగన్ పాలన.

(4) పోలవరం, అమరావతి ఆగిపోయాయి అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో గ్రాఫిక్స్ నిర్మాణాలు చూపించినప్పుడు లేని బాధ, రెండునెలలు పనిఆగితే ఎందుకో? ఇపుడు వర్షాకాలం. ఎలాగూ పనులు జరగవు. ఈ పనులన్నీ సమీక్షించి వేలకోట్ల ప్రజాధనం మిగిలిస్తే అది జగన్ గొప్పదనమే కదా. అయితే దీనికి పుష్కరకాలం తీసుకోకుండా తొందరగా ముగించి పనులు ప్రారంభించాలి. పోలవరం, అమరావతి అంటే కాంట్రాక్టర్లు మాత్రమే ఉండరు. అది వేలమంది కూలీల ఉపాధిగా కూడా ఉంటుంది.

(5) వాలంటీర్ల వ్యవస్థ తప్పుదారి పట్టకుండా చూడాలి. రెవెన్యూ వాళ్లలా వీళ్లు కూడా ప్రతి పనికి చెయ్యి తడిచేసుకుంటే పులిపోయి భూతం పట్టుకున్నట్టు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు పోయి వీళ్లు తయారవుతారు.

(6) పల్లెల్లో రేషన్ షాపులు వంద మీటర్లకి మించి దూరముండవు. ఇంటికే రేషన్ రావడం వల్ల ప్రజలకి జరిగే గొప్పమేలు కూడా లేదు. కానీ సంచులకి 750 కోట్లు ఖర్చు అంటున్నారు. డీలర్లు అవినీతికి పాల్పడినా అంతకి మించి పాల్పడలేరు. సంచుల వల్ల ప్రతిపక్షాలకి పంచ్‌లు అందివ్వడమే కదా!

(7) అన్నిటికి మించిన సవాల్ మద్యం. ఎన్టీయార్ మద్యనిషేధం పెట్టినపుడు దీన్ని ఫినిష్ చేసిన వాళ్లలో ముఖ్యులు పోలీసు, ఎక్సయిజ్, తెలుగు తమ్ముళ్లు. దేశంలో చోటా నాయకుల్ని కూడా కోటీశ్వరుల్ని చేసిందీ నిషేధం.

జగన్ అలర్ట్ గా లేకపోతే ఇప్పుడు జరిగేది కూడా ఇదే. కొత్తగా తెలంగాణ బార్డర్‌తో కలిపితే కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా వున్నాయి. ఓపిక చేసుకుని వెళితే యానాం. అక్రమ మద్యం ప్రవహిస్తుంది. గ్రామాల్లో దొంగసారా కాస్తారు. పోలీసు, ఎక్సయిజు ఎలాగూ మనస్ఫూర్తిగా ఈ పాలసీకి సహకరించరు. అయితే ప్రతి మంచిపనికీ కొన్ని చెడు పరిణామాలు ఉంటాయి. సమర్థులైన అధికారుల్ని గుర్తించి జగన్ గట్టిగా పనిచేయించుకుంటే ఈ పాలసీ పనిచేస్తుంది. లేదంటే బూమరాంగే.

ఇదంతా కత్తిమీద సాము కాదుకానీ, కత్తితో సాము. జాగ్రత్తగా తిప్పకపోతే మన కత్తి మనల్నే గాయపరుస్తుంది.

– జి.ఆర్.మహర్షి (సీనియర్ జర్నలిస్టు)

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్