ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత బీజేపీ నేతలంతా ఇదో సాహసోపేత నిర్ణయంగానే చెప్పుకుంటున్నారు. అవును, నిజమే.. ఎవ్వరు ఏమనుకున్నా అంతిమంగా మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం ప్రభుత్వ విధి. ఆ విధిని బీజేపీ సర్కారు నిర్వర్తిస్తోంది. అది సాహసమనే చెప్పుకోండి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం బీజేపీకి ఎందుకంత కడుపుమంట. తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటే ఎందుకంత ఆదుర్దా. ఏదో జరిగిపోతుంది, ఇంకేదో అయిపోతుందనే బాధ ఎందుకు? కేంద్రంలోని పెద్దల ఆదేశాలతో రాష్ట్ర బీజేపీ నేతలు జగన్ తీసుకునే నిర్ణయాలని ఎందుకు విమర్శిస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలే ఆత్మవిమర్శ చేసుకోవాలి.
పోలవరం టెండర్ల రద్దు, విద్యుత్ ఒప్పందాల రద్దుని కేంద్రం ఎందుకు తప్పుపడుతోందనేదే ఇప్పుడు చర్చకు వస్తోంది. పోలవరం పనుల్లో అవినీతి జరిగింది, వందల కోట్ల ప్రజాధనం ఇప్పటికే దుర్వినియోగం అయింది. దీన్ని సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలో రుజువు చేసిన తర్వాతే జగన్ రివర్స్ టెండర్ నిర్ణయం తీసుకున్నారు. వానాకాలం పూర్తయ్యేలోపు తిరిగి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. దీనికే పోలవరం ఆపేశారని, జగన్ కి ప్రాజెక్ట్ కట్టడం ఇష్టంలేదని రకరకాల ప్రచారాలు చేస్తోంది బీజేపీ. టీడీపీకి వంతపాడుతోంది.
ఇక పీపీఏల రద్దు కూడా ఇలాంటిదే. జనం సొమ్మే కదా అని రూపాయి కరెంటుకి రెండు రూపాయలు ఖర్చుపెట్టింది టీడీపీ సర్కార్. ఇలాంటి అవకతవకలన్నిటికీ చెక్ పెడుతూ జగన్ ఒప్పందాలను పునఃసమీక్షించి తిరిగి కొత్త కంపెనీలను ఆహ్వానించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తీసుకున్న మంచి నిర్ణయం ఇది. కానీ ఇది కూడా కేంద్రానికి తప్పుగా కనపడింది. ఒప్పందాలు రద్దు చేసుకుంటే కంపెనీలు వెనక్కి వెళ్లిపోతాయని, దేశంలోకి పెట్టుబడులు ఆగిపోతాయని కొర్రీలు పెట్టడం స్టార్ట్ చేసింది.
ఇలా జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బీజేపీ తప్పుపడుతూనే ఉంది. ఇవన్నీ ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలనీ తెలిసినప్పటికీ విమర్శలు ఆపడంలేదు. మరి ఏకపక్షంగా ఎవరితో చెప్పకుండా ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ఏమనాలి? కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ ఎందుకు సమాధానం చెప్పడంలేదు. వారిది ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయం అయినప్పుడు జగన్ తీసుకునే నిర్ణయాలు ఎందుకు తప్పుగా కనిపిస్తున్నాయి. ఈ లాజిక్ బీజేపీ నేతలకే తెలియాలి? ఇకనైనా జగన్ పై విమర్శలు ఆపుకోవాలి.