ఒకప్పుడు రాజులు, మహారాజులు, చక్రవర్తులు పరిపాలన చేశారు. కొందరు నిరంకుశంగా వ్యవహరించేవారు. 'రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా?' అనే సామెత తెలిసిందే. రాజుల పాలనలో చర్చలు, సంప్రదింపులు వగైరా ఉండేవికాదు. నిరంకుశత్వాన్ని భరించలేని ప్రజలు కాలక్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే చర్చలు, సంప్రదింపులే కీలకం. వాటికి వేదికలు చట్టసభలు. ప్రతి నిర్ణయానికి అనుకూలత ఎంత ఉంటుందో, వ్యతిరేకతా అంతే ఉంటుంది. ప్రతి నిర్ణయం ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారం, చర్చలు, సంప్రదింపులు ,రాయబారాలు సాగించి తీసుకోవాలంటే ఏళ్లూపూళ్లు పట్టడమే కాకుండా, ఎప్పటికీ అవి సాకారం కాకపోవచ్చు కూడా. అందుకే ప్రజాస్వామ్యంలోనూ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవల్సివుంటుంది. చర్చలు, సంప్రదింపులు, రాయబారాలు పక్కనపెట్టి వేగంగా, గోప్యంగా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంటుంది. ఇది తప్పా ఒప్పా అనేది జనం ఎవరికివారు నిర్ణయించుకోవాల్సిందే.
ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమూ వందశాతం ప్రజలను మెప్పించదు. ఇప్పటి ప్రజాస్వామ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి రాచరిక లక్షణాలు ఉన్నాయి. రాజు మాదిరిగా నిరంకుశంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు జమ్ము కశ్మీర్ విషయంలోనూ అలాగే వ్యవహరించారు. ఈ రాష్ట్రాన్ని రెండుభాగాలు చేసి, రెండింటినీ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం, ఒక భాగంలో (జమ్ము కశ్మీర్) అసెంబ్లీ ఏర్పాటు చేసి, మరోదానిలో (లద్దాక్) అసెంబ్లీ లేకుండా పూర్తి కేంద్రపాలిత ప్రాంతం చేయడంపై ప్రజల్లో ఎంత అనుకూలత వ్యక్తమైందో, వ్యతిరేకతా అంతే వ్యక్తమైంది. నిజంగా ఇదో చరిత్రాత్మక పరిణామం. జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయడం మామూలు సాహసం కాదు. దేశంలో రాష్ట్రాలను విభజించడం, జమ్ము కశ్మీర్‌ను విభజించడం ఒకటికాదు. ఉమ్మడి ఏపీని విడగొట్టినప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వం నిరంకుశంగానే (పార్లమెంటులో) వ్యవహరించింది. రాష్ట్రం విడిపోయాక కాలక్రమంలో అంతా సర్దుకుందనుకోండి. కాని జమ్ము కశ్మీర్ అనేది దశాబ్దాలుగా రగులుతున్న చిచ్చు.
ఇది పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో ముడిపడి ఉన్న సమస్య. అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన సమస్య. ఏడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాలూ ఈ సమస్యను పరిష్కరించలేకపోయాయి. చివరకు మోదీ సర్కారు సాహసించింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో కాలక్రమంలో తెలుస్తుంది. జమ్ము కశ్మీర్ విషయంలో సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పాక్‌తో మరో యుద్ధానికి దారి తీస్తుందని కొందరంటున్నారు. ముఖ్యంగా ఇంత గోప్యత పాటించడమేమిటనే విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యా సూత్రాలకు విరుద్ధమంటున్నారు. ఆర్టికల్ 370 కారణంగానే జమ్ము కశ్మీర్ భారత్‌లో ఉందని, ఇప్పుడు దాన్ని రద్దు చేయయడంతో ఆ రాష్ట్రం రావణ కాష్టమవుతుందని కొందరంటున్నారు. ఉగ్రవాదుల స్థావరమైన జమ్ము కశ్మీర్‌లో ఎప్పుడేమైనా జరగొచ్చు. అన్నిటికీ సిద్ధపడే మోదీ సర్కారు ఈ కఠిన నిర్ణయం తీసుకుందనడంలో సందేహంలేదు.
జమ్ము కశ్మీర్ భారత్‌లో భాగంగా చెప్పుకుంటున్నప్పుడు దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకనేది బీజేపీ మౌలిక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఏడు దశాబ్దాల వయసు. బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్ ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్ నేత మోదీ దాన్ని సాకారం చేశారు. జమ్ము కశ్మీర్‌ను విడదీస్తామంటూ దీన్ని ముందే చర్చలకు పెట్టివుంటే, చర్చలు, సంప్రదింపులు కొనసాగించివుంటే ముందుకు పడనిచ్చేవారా? మరో ఏడు దశాబ్దాలైనా ఇలాగే ఉండేది. అందుకే గోప్యత పాటించారు. మంచుపర్వతాల రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునేలోపలే రాష్ట్రాన్ని విడగొట్టడం, 370, 35ఎ ఆర్టికల్స్‌ను రద్దు చేయడం జరిగిపోయింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు సైతం మద్దతు పలకడం విశేషం.
ఇందిరాగాంధీ పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని పంపారు. అది అత్యంత సాహసోతమైన చర్య. కాని దాని ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మోదీ, అమిత్‌షా కూడా ప్రాణాలు పణంగా పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యంలోనూ నిరంకుశత్వం తప్పదు. దీంతో సమస్య పరిష్కారవముతుందా? మరిన్ని సమస్యలకు దారి తీస్తుందా అనేది వేచి చూడాల్సిందే.