ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంది!

ఆర్టికల్ 370 రద్దువలన కాశ్మీరానికి ఏంటి ప్రయోజనం. అక్కడి ప్రజలు ఎలాంటి లబ్ధిపొందుతారు? అనే విషయంలో అనేక రకాల దృక్కోణాలు వినవస్తున్నాయి. విద్యా వైద్యసదుపాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఆతిధ్య రంగం కూడా విస్తృతం…

ఆర్టికల్ 370 రద్దువలన కాశ్మీరానికి ఏంటి ప్రయోజనం. అక్కడి ప్రజలు ఎలాంటి లబ్ధిపొందుతారు? అనే విషయంలో అనేక రకాల దృక్కోణాలు వినవస్తున్నాయి. విద్యా వైద్యసదుపాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఆతిధ్య రంగం కూడా విస్తృతం అవుతుందని, కొత్తగా ఫ్యాక్టరీలు వస్తాయని ఆ ప్రాంతంలో అసలైన అభివృద్ధి కనిపిస్తుందని అందరూ చెబుతున్నారు. అయితే ఖచ్చితంగా ఈ నిర్ణయం వల్ల ఉగ్రవాదం కూడా గరిష్టంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

ఇన్నాళ్లూ కాశ్మీర్లో స్థానికులు అంటే అక్కడి అసెంబ్లీ నిర్వచించిన ప్రకారం ఉండేవారు మాత్రమే. వారికి మాత్రమే అక్కడ స్థిరనివాసాలు ఉంటాయి. టూరిస్టులు ఏదో టూరిజం ప్రాంతాలకు వెళ్లడమూ, కొన్ని రోజులు గడిపి వచ్చేయడమూ తప్ప.. అక్కడి సాంద్రమైన జనావాసాలలో మెదిలే అవకాశం కూడా ఉండేదికాదు. అలాంటి పరిస్థితిలో అదే ప్రజల మధ్యలోనే ఉగ్రవాదులు తిరుగుతూ ఉన్నప్పటికీ ఎవరూ గుర్తించలేని పరిస్థితి. ఉగ్రవాదుల కదలికల్ని ఇదివరకటి స్థానికులు గుర్తించినప్పటికీ.. భద్రత వర్గాలకు తెలియజేయడానికి భయపడే పరిస్థితి ఉండేది. తాము ఎక్కడ టార్గెట్ గా మారుతామేమోనని జంకేవాళ్లు.

ఇలాంటి పరిస్థితి ఇప్పుడు సమసిపోనుంది. జనావాస ప్రాంతాల్లో యావద్భారతం నుంచి ప్రజలు ఎవ్వరైనా స్థిర నివాసాలు ఏర్పరచుకునే పరిస్థితి ఉంది. అందుకు చాలామంది ఉత్సాహంగానే ఉన్నారు. ప్రధానంగా కేవలం ఉగ్రవాదానికి స్థానిక ప్రభుత్వాల ఆగడాలకు భయపడి.. కాశ్మీరం నుంచి భారత్ లోని ఇతర ప్రాంతాలకు వలసవచ్చేసిన కాశ్మీరీ పండిత్ లు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారంతా కూడా తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తామని అంటున్నారు.

అంటే మొత్తంగా గమనించినప్పుడు.. కాశ్మీరు ప్రాంతంలో.. కేవలం ఉగ్రవాద అనుకూల లేదా భయపడే వర్గాలు మాత్రమే కాకుండా, ఇతర వర్గాలకు చెందిన ప్రజల సంఖ్య రాబోయే రోజుల్లో భారీగా పెరుగుతుంది. దాంతో సహజంగానే ఉగ్రవాద కదలికలు కూడా తగ్గుతాయి. అలాంటివి ఉంటే ఎప్పటికప్పుడు భ్రదతబలగాలకు తెలుస్తాయి. సునాయాసంగా వారిని ఏరిపారేస్తుంటారు. కాకపోతే.. ఆ ప్రాంతంలో కొత్తగా స్థిరపడదలచుకునే వారు కొన్నాళ్లపాటూ బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది.

కానీ రాబోయే రోజుల్లో కూడా చాలాకాలం వరకు భద్రత చర్యలు చాలా గట్టిగానే ఉంటాయని అనుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారిలో భయచిహ్నాలు తొలగిపోయేలాగా.. ఉగ్రవాదం కూడా చాలావరకు అంతమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్