జ‌గ‌న్ ఆశీర్వాద యాత్రట‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి క‌ల‌వ‌డం కొందరు జీర్ణించుకోలేకున్నారు. కొంద‌రికి క‌డుపు మండుతోంది. జ‌గ‌న్‌ను కుటుంబ స‌మేతంగా క‌లవ‌డం, క‌లిసి భోజ‌నం చేయ‌డం నేరం, ఘోరం అన్న‌ట్టు కొంద‌రు రాజ‌కీయ నేత‌లు, మీడియా…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి క‌ల‌వ‌డం కొందరు జీర్ణించుకోలేకున్నారు. కొంద‌రికి క‌డుపు మండుతోంది. జ‌గ‌న్‌ను కుటుంబ స‌మేతంగా క‌లవ‌డం, క‌లిసి భోజ‌నం చేయ‌డం నేరం, ఘోరం అన్న‌ట్టు కొంద‌రు రాజ‌కీయ నేత‌లు, మీడియా సంస్థ‌లు ల‌బోదిబోమంటున్నాయి. కిష‌న్‌రెడ్డి చేప‌ట్టింది జ‌న ఆశీర్వాద యాత్రా? లేక జ‌గ‌న్ ఆశీర్వాద యాత్రా? అని టీడీపీ అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా ప్ర‌శ్నిస్తున్నాయంటే ఎంతగా ఓర్వేలేకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

‘జన ఆశీర్వాద యాత్ర’ పేరిట దేశమంతటా కేంద్ర మంత్రుల పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి గురువారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించారు. మొద‌ట ఆయ‌న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. 

విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో విజయవాడ చేరుకున్న ఆయన.. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు త‌ప్ప అభివృద్ధి లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బీజేపీ శ్రేణుల‌పై వైసీపీ దాడుల‌కు పాల్ప‌డుతోంద‌ని మండిప‌డ్డారు.

అనంత‌రం ఆయ‌న త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇంటికెళ్లారు. జగన్‌ దంపతులు వారికి స్వాగతం పలికారు. కిషన్‌రెడ్డిని శాలువాతో సత్కరించి, శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమను జ‌గ‌న్‌ బహూకరించారు. అలాగే కిష‌న్‌రెడ్డి భార్య‌కు జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి చీర‌ను బ‌హూక‌రించారు. అనంత‌రం జ‌గ‌న్ కుటుంబంతో క‌లిసి కిష‌న్‌రెడ్డి కుటుంబం భోజనం చేసింది. అరగంట తర్వాత రోడ్డు మార్గం ద్వారా కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగింద‌ని బీజేపీ, వైసీపీ నేతలు ప్ర‌క‌టించారు.

బీజేపీతో వైసీపీ ఘ‌ర్ష‌ణ ప‌డితే తాము లాభ‌ప‌డ‌తామ‌ని భావిస్తున్న రాజ‌కీయ‌, మీడియా శ‌క్తులు కొన్ని వారి క‌ల‌యిక‌పై నెగెటివ్ ప్ర‌చారానికి దిగాయి. ఒక‌వైపు త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ దాడులు చేస్తోంద‌ని విమ‌ర్శిస్తూ, మ‌రోవైపు సీఎం ఇంటి కెళ్ల‌డం, ఆయ‌న‌తో క‌లిసి భోజ‌నం చేయ‌డం ఎలా చేస్తార‌నే ప్ర‌శ్న‌ల‌ను తెర‌పైకి తెచ్చారు. 

ఇది కార్య‌క‌ర్త‌ల స్థైర్యాన్ని దెబ్బ తీయ‌వా అని వారు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న ప్రతిపక్షాల ప్రచారానికి కిషన్‌రెడ్డి చర్య ఊతమిచ్చిందని గ‌గ్గోలు పెడుతుండ‌డం గ‌మ‌నార్హం.