ఎవరు దగ్గరకు వెళ్లినా చిరునవ్వుతో పలకరించే మనస్తత్వం సీఎం జగన్ ది. పాదయాత్రలో ఆయన అభిమానం, ఆత్మీయత చవిచూడనిది ఎవరు? అలాంటి స్వచ్ఛమైన ప్రేమని కూడా తప్పుబట్టిన సంకుచిత మనస్తత్వం పచ్చబ్యాచ్ ది. ఇక చంద్రబాబు విషయానికొద్దాం. తనకి పనికొచ్చేవారికి మాత్రమే పెద్దపీట వేసే టైపు ఆయన. అలాంటి బాబుని కూడా పూర్తిగా మేకోవర్ అయ్యేలా చేశారు సీఎం జగన్.
ఎన్నికల్లో ఘోర ఓటమి బాబుని పూర్తిగా డైలమాలో పడేసింది. ఆ తర్వాత కూడా పేద ప్రజల్లో జగన్ పై రోజురోజుకీ పెరుగుతున్న అభిమానం, రూట్ లెవల్ కి వెళ్తున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబుకి ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. వచ్చే ఎన్నికల వరకు నాయకులు ఎలాగూ నిలవరు, కనీసం కార్యకర్తల్ని అయినా కాపాడుకుంటాం అనుకుంటున్నారు బాబు. అందుకే ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా నేరుగా చంద్రబాబు నుంచే ఫోన్ వెళ్తోంది.
ఇటీవల సోషల్ మీడియా కేసులతో ఇబ్బంది పడ్డ పచ్చ పెయిడ్ బ్యాచ్ కి నేరుగా చంద్రబాబే ఫోన్ చేయడం దీనికి నిదర్శనం. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కార్యకర్తకు కూడా ఇలాగే బాబు ఫోన్ చేసి ఓదార్పునిచ్చారట. గతంలో ఇలాంటి ఫోన్ పలకరింపులు చాలా విచిత్రంగా ఉండేవి. ఓ మోస్తరు లీడర్ సదరు కార్యకర్త వద్దకు వెళ్లి పలకరించి వస్తూ వస్తూ ఇదిగో బాబుగారికి ఫోన్ చేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చి ఆ ఫోన్, కార్యకర్త చెవిదగ్గర పెట్టి ఓ ఫొటో తీసుకుని నాటకం రక్తికట్టించి వెళ్లిపోయేవాడు. కట్ చేస్తే తెల్లారి పొద్దున పేపర్లో కార్యకర్తని పలకరించిన పార్టీ పెద్ద అంటా వార్త వచ్చేది.
ఇప్పుడలాంటి జిమ్మిక్కులేం లేవు. పనిగట్టుకుని మరీ నాయకుడే కార్యకర్తలకు ఫోన్లు చేసుకుంటున్నారు, అవసరమైతే ఆ కాల్ రికార్డ్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ రకంగా బాబు మైండ్ సెట్ ను జగన్ మార్చినట్టే.
గతంలో బాబు రిసీవర్ ఎత్తితే అవతల అమెరికా అధ్యక్షుడో లేక, కేంద్ర మంత్రులో.. అన్నట్టు బిల్డప్ ఉండేది, ఇప్పుడు మాత్రం చంద్రబాబు సామాన్య కార్యకర్తలకి కూడా నేరుగా ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. చిన్నా పెద్దా అందరికీ ట్విట్టర్ లో పెదబాబు, చినబాబు పోటీపడి మరీ శుభాకాంక్షలు చెప్పడం కూడా ఈ స్ట్రాటజీలో భాగమే. కొన్నిరోజులాగితే పక్కపార్టీ కార్యకర్తలకి కూడా లోకేష్ బర్త్ డే విషెస్ ట్వీట్ వేసేలా ఉన్నాడు.
కార్యకర్తలు, నాయకులు ఎవరూ పార్టీని అంటిపెట్టుకునే పరిస్థితి లేదు అని తేలిన తర్వాతే పెదబాబు, చినబాబు రంగంలోకి దిగారు. పరామర్శల యాత్ర పేరుతో శుభ్రంగా వంటింట్లో దూరి కడుపునిండా లాగించి మరీ బయలుదేరుతున్నారు లోకేష్. చంద్రబాబు ఫోన్ల సంగతి సరేసరి. పనిగట్టుకుని చేసినా, భవిష్యత్ లో పనికొస్తాడని తెలిసి చేసినా.. మొత్తమ్మీద చంద్రబాబులో వచ్చిన ఈ విపరీత మార్పుని చూసి సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారు.