కొన్నాళ్ల కిందట తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నయీం ఎన్ కౌంటర్ తర్వాత అనేక విషయాలు చర్చలోకి వచ్చాయి. గ్యాంగ్ స్టర్ అయిన నయీంతో అనేక మంది పోలీస్ పెద్ద మనుషులకు సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఏకంగా ఐపీఎస్ స్థాయి అధికారులతో నయీంకు సంబంధాలుండేవని, వాళ్ల చీకటి వ్యవహారాలను నడిపించేందుకు అలాంటి గ్యాంగ్ స్టర్ ను వాడుకున్నారనే పుకార్లు గుప్పుమన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన, పని చేస్తున్న పలువురు పోలీసాఫీసర్ల పేర్లు ఆ విషయంలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే నయీం హతం కావడంతో.. అతడితో వారి సాన్నిహిత్యాన్ని నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాలూ లేకుండా పోయాయి! నయీం ఎన్ కౌంటర్ తో వాళ్లు సేఫ్ జోన్లోకి వచ్చారంటారు.
వికాస్ దుబే విషయంలోనూ ఇలాంటి విమర్శలే అప్పుడే రాజుకున్నాయి. ఆ గ్యాంగ్ స్టర్ తో తమ సత్సంబంధాలను మరుగు పరిచే క్రమంలో అతడిని ఎన్ కౌంటర్ చేశారు అనే ఆరోపణ సుప్రీం కోర్టు వరకూ చేరింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలైంది.
దశాబ్దాలుగా గ్యాంగ్ స్టర్ గా వికాస్ దుబే ఎన్నో ఘాతుకాలకు పాల్పడ్డాడు. అందులో సందేహం లేదు. ఏకంగా ఒక మంత్రిని పోలిస్ స్టేషన్లో హత్య చేసి సాక్ష్యాలు లేవనే కాజ్ ద్వారా నిర్దోషిగా బయటపడిన చరిత్ర ఉంది అతడికి. అక్కడ నుంచినే పోలీసులపై కూడా వికాస్ పట్టు పెరిగిందని తెలుస్తోంది. దేన్నైనా మేనేజ్ చేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు. యూపీలో అధికార పార్టీలు మారినా.. వికాస్ లాంటి వాళ్ల హవాకు అడ్డు లేకుండా పోయింది. ఎంతకు తెగిస్తే పోలీసుల మీదే ఎదురు కాల్పులు జరిపి వాళ్లను చంపి ఉండాలి!
అయినా మంత్రినే చంపి దర్జాగా బయటకు వచ్చిన వాడికి పోలీసులు ఒక లెక్క? అంతటి ఘాతుకాలకు పాల్పడుతున్నాడంటే పోలీసుల వాటాలూ ఇన్నేళ్లూ పోలీసులకు అంది ఉండకపోవు! ఇప్పుడు వికాస్ దుబే బతికి ఉంటే.. ఎవరికి ఎంత ఇచ్చింది? పోలీస్ శాఖపై అతడి పట్టు ఎంత, రాజకీయ నేతలతో అతడి సంబంధాలు ఏమిటి? అనే విషయాలన్నీ బయటకు వచ్చేవి. అయితే అలాంటి విషయాలు బయటకు రావడం అటు పోలీసులకూ, ఇటు ప్రభుత్వాలకూ ఇష్టం ఉండదు. ఇలాంటి రౌడీ షీటర్లను తయారు చేసేదీ ఆ వ్యవస్థలే, హతం చేసేదీ ఆ వ్యవస్థలే! ఈ వికాస్ దుబే పోతే ఇంకోడు. వాళ్ల అవసరాలు తీరడానికి ఎవడైతేనేం?