ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్‌ను నెరవేర్చడానికి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సీఎం జగన్ తెలిపారు. లెక్కలేసి మరీ ఆయన గణాంకాలతో సహా ఉద్యోగ సంఘాల నేతలకు వివరించడం గమనార్హం. పీఆర్సీ సాధన సమితితో మంత్రి వర్గ ఉపసంఘం నిర్వహించిన చర్చలు సఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు, ప్రభుత్వాధినేత జగన్ పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. సాధకబాదకాలు చెప్పుకోవడం ఈ సమావేశం ప్రత్యేకత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని తమ ప్రతిపాదనలకు అంగీకరించిన ఉద్యోగ సంఘాల నేతలకు జగన్ కృతజ్ఞతలు చెప్పడం గమనార్హం.
అలాగే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వంపై ఆర్థికంగా పడే భారం ఎంతనే విషయాన్ని సంబంధిత నేతలతో జగన్ పంచుకోవడం విశేషం. ఐఆర్ ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐఆర్‌ను సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400కోట్లు భారం పడుతోందని సీఎం తెలిపారు.
హెచ్ఆర్ఏ రూపంలో అదనంగా మరో రూ.325 కోట్లు భారం పడుతోందని జగన్ వెల్లడించారు. అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్ వ్యయం రూపేణా హెచ్ఆర్ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్ క్వాంటమ్పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోందని జగన్ గణాంకాలతో సహా వివరించారు.
ఇలా ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వంపై మొత్తంగ రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోందని ఆయన వివరించారు. డిమాండ్లను నెరవేర్చడానికి తనకు ఆర్థికంగా ఎదురవుతున్న అవరోధాల గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ లెక్కలన్నీ చెబుతున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ అన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ఇవ్వడానికి ఉద్యోగుల వల్లే సాధ్యపడుతోందని ఆయన ప్రశంసించడం విశేషం. ఉద్యోగులు చెప్పేవి వినడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.