ఉద్యోగులు ఊకొట్టినా…ఆయ‌న మాత్రం ఊహూ!

త‌మ డిమాండ్ల‌పై ప్ర‌భుత్వంతో జ‌రిపిన చ‌ర్చ‌లు సంతృప్తి ఇచ్చాయ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు. అయితే ఉద్యోగుల‌కు లేని బాధ‌, ఆవేద‌న ప్ర‌తిప‌క్షాల్లో మాత్రం క‌నిపిస్తోంది. నూత‌న పీఆర్సీతో పాటు మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌పై ఉద్యోగులు…

త‌మ డిమాండ్ల‌పై ప్ర‌భుత్వంతో జ‌రిపిన చ‌ర్చ‌లు సంతృప్తి ఇచ్చాయ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు. అయితే ఉద్యోగుల‌కు లేని బాధ‌, ఆవేద‌న ప్ర‌తిప‌క్షాల్లో మాత్రం క‌నిపిస్తోంది. నూత‌న పీఆర్సీతో పాటు మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌పై ఉద్యోగులు ఉద్య‌మ బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 3న చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం అద్భుతంగా విజ‌య‌వంత‌మైంది. ఒక ర‌కంగా ప్ర‌భుత్వ వెన్నులో ఉద్యోగులు వ‌ణుకు పుట్టించారు.

ఈ నేప‌థ్యంలో వ‌రుస‌గా రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో మంత్రుల క‌మిటీ చ‌ర్చించింది. చివ‌రికి ఇరువైపుల వాళ్లు ప‌ట్టువిడుపుల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు స‌త్ఫ‌లితాలు ఇచ్చాయి. దీంతో ఉద్యోగుల స‌మ‌స్య‌కు శుభం కార్డు ప‌డింది. సినిమా భాష‌లో చెప్పాలంటే ఉద్యోగుల పోరాటం సుఖాంత‌మైంది.

కానీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మాత్రం ఉద్యోగులు ఉద్య‌మ‌బాట వీడ‌డం మ‌రో ర‌కంగా క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్‌కు కూడా కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన నేప‌థ్యంలో… సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్‌క‌ల్యాన్ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ప్ర‌భుత్వ ఆధిప‌త్య ధోర‌ణితో ఉద్యోగుల‌కు ఊర‌ట ద‌క్క‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఫేస్‌బుక్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెట్టిన పోస్టులో ఏమున్న‌దంటే…

” ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లింది. ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించలేదు. ఫిట్మెంట్, గత హెచ్ఆర్‌ఏ కొనసాగింపు, అశుతోష్ మిశ్రా నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వెత్తున చేసిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసింది. 

ఇవేవీ నెరవేరకుండానే… ఐఆర్, హెచ్ఆర్ఏ, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీని పాక్షికంగా చేసినా సరే సమ్మె ఉపసంహరించు కొని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించింది. ఈ ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని, వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిగణనలోకి తీసుకొంటుంది. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గంపట్ల జనసేన పార్టీ సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ, వారి భావోద్వేగాలకు విలువ ఇస్తుంది” అని ప‌వ‌న్ సానుభూతి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌డం ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు న‌చ్చ‌లేద‌నేందుకు ఇంత కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఉద్యోగులు రోడ్డెక్కి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తుంటే, ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూసిన ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌భుత్వం ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించింది. ఉద్యోగుల డిమాండ్ల‌పై ఒక మెట్టు దిగి, సానుకూలంగా స్పందించ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఖంగుతిన్నాయి. 

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంత సుల‌భంగా స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రిస్తుంద‌ని ఊహించ‌ని ప్ర‌త్య‌ర్థుల‌కు ఇప్పుడేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఉద్యోగుల ఉద్య‌మంపై ప‌వ‌న్ తాజా పోస్టులోని అభిప్రాయాలు కేవ‌లం ఆయ‌న‌వి మాత్ర‌మే అంటే న‌మ్మ‌శ‌క్యం కాద‌నే వాళ్లు లేక‌పోలేదు. ఎందుకంటే ప‌వ‌న్ రాజ‌కీయ సంబంధాల గురించి తెలిసిన వాళ్ల‌కు ఆ మాత్రం అనుమానం రాకుండా ఎలా వుంటుంది.