ఉద్యోగుల డిమాండ్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫినీషింగ్ టచ్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా నూతన పీఆర్సీ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య గ్యాప్ పెంచిన సంగతి తెలిసిందే. తాము ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆవేదన ఉద్యోగులతో ఘాటుగా మాట్లాడించింది. జగన్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఉద్యోగులు మండిపడ్డారు. మరోవైపు డిమాండ్లు సాధించుకునేందుకు సమ్మెబాటే ఏకైక ప్రత్యామ్నాయమని ఉద్యోగులు హెచ్చరించారు.
అయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. చివరికి అందరికీ ఆమోద యోగ్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తమ డిమాండ్ల విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు పీఆర్సీ సాధన సమితిలోని వివిధ సంఘాల నేతలు సిద్ధమయ్యారు. కాసేపటి క్రితం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు.
తమ సమస్యల పరిష్కారానికి పెద్ద మనసుతో ఆలోచించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంలో ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని వారితో జగన్ అన్నారు. తమందరితో ఒకటే కుటుంబమంటూ జగన్ ఆత్మీయంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా… ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ఉద్యోగ సంఘాల నేతలకు జగన్ ధన్యవాదాలు తెలిపారు.
మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం అని …జగన్ అన్న మాటలకు ఉద్యోగులు ఫిదా అయ్యారు. ఆర్థిక పరిస్థి తులు ఏ మాత్రం ఆశాజనకంగా ఉన్నా … మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినన్నారు. మీరు లేకపోతే నేను లేను అని జగన్ అనడంతో ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు.
ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చని ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ అన్నారు. కాని ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేసినట్టు జగన్ చెప్పారు. ఇందులోకి రాజకీయాలు వస్తే.. వాతావరణం దెబ్బతింటుందని జగన్ అన్నారు. రాజకీయాలకు తావు ఉండకూడదని తేల్చి చెప్పారు.
ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని, ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చని సీఎం సూచించారు. ప్రభుత్వం అంటే ఉద్యోగు లది అని అన్నారు. నిన్న మంత్రుల కమిటీ తనతో టచ్‌లోనే ఉందన్నారు. తన ఆమోదంతోనే ఉద్యోగుల డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు జగన్ తెలిపారు.