తెలంగాణ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య వార్ రోజురోజుకూ ముదురుతోంది. ప్రధాని మోడీ ఒకరోజు పర్యటన నిమిత్తం తెలంగాణ వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార పార్టీ పెద్దలెవరూ అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. దీంతో జాతీయ అధికార పార్టీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ రానున్న రోజుల్లో మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారానికి బలం చేకూరింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి ప్రధాని మోడీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో శనివారం సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్క రించడాన్ని పురస్కరించుకుని కేటీఆర్ సెటైర్ విసిరారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనమని, సమతామూర్తి స్ఫూర్తికే విరుద్ధమని ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పక్షపాతానికి ఐకాన్‌లాంటి వ్యక్తి(ప్రధాని మోదీని దృష్టిలో పెట్టుకుని) సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ట్యాగ్‌తో కేటీఆర్ ట్వీట్ చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కేటీఆర్ ధైర్యానికి ప్రతీకగా తాజా ట్వీట్‌ను ఆయన అభిమానులు ఉదహరిస్తున్నారు. అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న మోడీపై కేటీఆర్ ట్వీట్‌తో ఇరగదీశాడంటూ కామెంట్స్ రావడం గమనార్హం.
ప్రధాని మోదీని తెలంగాణ అధికార పార్టీ టార్గెట్ చేసిందనేందుకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 2023లో తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్న బీజేపీకి అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతి రోజూ సవాల్‌గా మారింది. అందుకే తెలంగాణ రాజకీయాలు రానున్న రోజుల్లో ఏ మలుపు తీసుకోనున్నాయో అన్న చర్చకు తెరలేచింది.