అండర్ 19 ప్రపంచకప్ ను సాధించిన యువ ఆటగాళ్లకు బీసీసీఐ మంచి పారితోషికాన్ని ప్రకటించింది. ఈ ప్రపంచకప్ లో ఇండియా తరఫున పాల్గొన్న ప్రతి ఆటగాడికీ ఒక్కోరికి 40 లక్షల రూపాయల చొప్పున గిఫ్ట్ ను ప్రకటించింది బీసీసీఐ. అండర్ 19 ఆటగాళ్లకు ఇది మెరుగైన స్థాయి పారితోషికమే అని చెప్పాలి.
ఈ డబ్బుకు మించి ఈ సారి టోర్నీలో పాల్గొన్న కొందరి ఆటగాళ్లకు మంచి గుర్తింపు దక్కుతోంది. కేవలం ప్రపంచకప్ గెలవడం కాదు… ఆటలో కూడా సత్తా చూపించారు ఈ 19 యేళ్ల వయసులోపు పిల్లలు. సెంచరీలు సాధించడంలో అయినా, వికెట్ల విషయంలో అయినా.. తమ ప్రత్యేకతను చాటుకున్నారు. భారీ షాట్లను ఆడగల ధీమాను ప్రదర్శించారు. కొందరు ఆటగాళ్లు చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నారు. ఈ విషయంలో ఇండియా జాతీయ జట్టు ప్లేయర్లతో తాము ఏం తీసిపోమన్నట్టుగా ఉంది వారి ఆటతీరు.
కాస్త ముందే ఈ ప్రపంచకప్ జరిగి ఉంటే.. ఈ పాటికి ఐపీఎల్ వేలం పాటలోకి పలు పేర్లు వచ్చేవేమో! ఇప్పటికే రంజీల్లో పాల్గొని ఉన్న అండర్ 19 ఆటగాళ్లకు ఈ అవకాశం ఉంటుంది. అయితే వేలం లోకి రాకపోయినా.. అండర్ 19 ప్రపంచకప్ విజేత జట్టులోని సభ్యులకు డైరెక్టుగా ఐపీఎల్ టికెట్ దొరికినట్టే. కొత్తగా రెండు జట్లు కూడా వస్తున్న నేపథ్యంలో.. ఈ ఆటగాళ్లలో చాలా మందికి ఐపీఎల్ కాంట్రాక్టులు దొరికే అవకాశం ఉంది.
ఇది వరకూ కూడా అండర్ 19 ప్రపంచకప్ విజయంతో ఐపీఎల్ టికెట్ పొందిన పలువురు ఆటగాళ్లున్నారు. ప్రస్తుత స్టార్ ఆటగాడు విరాట్ కొహ్లీ కూడా ఇదే తరహాలో వచ్చినవాడని వేరే చెప్పనక్కర్లేదు. 2008లో కొహ్లీ దశ ఇలానే తిరిగింది. అండర్ 19 ప్రపంచకప్ ను నెగ్గిన జట్టు కెప్టెన్ గా కొహ్లీకి ఆర్సీబీతో ఒప్పందం కుదిరింది. అక్కడి నుంచి కొహ్లీ స్టార్ అయ్యాడు.
ఇప్పుడు ప్రపంచకప్ ను సాధించిన కుర్రాళ్లకు కూడా దాదాపు అందరికీ ఐపీఎల్ అవకాశాలు ఉండనే ఉంటాయి. కొందరికి బేస్ ప్రైజ్ తో మరి కొందరికి అంతకు మించిన స్థాయి ఒప్పందాలు కుదిరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.