ప్రధాని మోడీ పేరు వింటే చాలు ప్రత్యర్థలు వణికిపోయే పరిస్థితి. మోడీపై వ్యతిరేకత అంతా మీడియా సృష్టే అనే ప్రచారం లేకపోలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశానికి పరిచయమైన మోడీ… అనూహ్యంగా తన పరపతిని పెంచుకున్నారు. అద్వానీ లాంటి అగ్రనాయకులు ఉన్నప్పటికీ, వారిని కాదని పార్టీ శ్రేణులు, దేశ ప్రజానీకం మోడీనే ఎక్కువగా అభిమానించారు. అదే ఆయనకు శ్రీరామరక్షగా నిలిచింది.
ఒకప్పుడు గుజరాత్ బహిష్కరణకు గురైన అమిత్ షా… ప్రస్తుతం మోడీ తర్వాత దేశంలో అత్యంత శక్తిమంతుడైన నాయకుడిగా పేరు పొందారు. అమిత్ షా చల్లని చూపు ఉంటే చాలు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సొంత పార్టీ నేతలే కాదు, ప్రత్యర్థులు కూడా భావించే దుస్థితి. అలాంటి మోడీ, అమిత్‌షాలకు దేశంలో ఎదురే లేని పరిస్థితుల్లో తానున్నానంటే కోల్‌కతా కాళి మమతా బెనర్జీ తెరపైకి వచ్చారు.
పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది. అయితే ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తులేస్తూ మమతాబెనర్జీ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మోడీ సర్కార్‌కు ఎదురొడ్డి పోరాడే బలమైన, ఏకైక ప్రత్యర్థి ఎవరని ప్రశ్నిస్తే… మమతా బెనర్జీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది.
తాజాగా మమతా బెనర్జీ తర్వాత పేరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చెప్పుకోవచ్చు. గత కొంత కాలంగా మోడీ సర్కార్‌తో పాటు తెలంగాణ బీజేపీ నేతల విధానాలపై కేసీఆర్, టీఆర్ఎస్ వర్గాలు రగిలిపోతున్నాయి. ఢీ అంటే ఢీఅని తలపడు తున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు బీజేపీ నేతలను తిట్టని తిట్టంటూ లేదు.
ఏకంగా రాజ్యాంగాన్నే మార్చాలని డిమాండ్ చేసే స్థాయికి కేసీఆర్ వెళ్లారు. అయితే కేసీఆర్ నిలకడలేని రాజకీయంపై సర్వత్రా అనుమానాలు లేకపోలేదు. కేసీఆర్ తిట్టడం, పొగడ్తలు కురిపించడం అంతా నిమిషాల్లో పని అని నెటిజన్లు సెటైర్స్ విసరుతున్నారు. బహుశా తనపై నమ్మకాన్ని పెంచుకునే ఉద్దేశమో, మరే కారణమో తెలియదు కానీ ప్రధాని మోడీ తెలంగాణలో ఒక్క రోజు పర్యటనకు వస్తే, కేసీఆర్ గైర్హాజరు కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
హైదరాబాద్‌లో ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ గైర్హాజర్ కావడం ద్వారా ఇక సమరమే అనే సంకేతాల్ని బీజేపీకి పంపారనే చర్చకు దారి తీసింది. నిజానికి రాజకీయంగా తిడుతూనే, ప్రభుత్వ పరంగా పాల్గొనే సంప్రదాయాన్ని కేసీఆర్ గౌరవిస్తారు. ఈ దఫా ఎందుకనో మోడీతో కాస్త గట్టిగానే తలపడేందుకు సిద్ధమయ్యారనే తాజా తెలంగాణ రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి.
సీఎం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధ పడుతుండడం వల్లే ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనలేదని సీఎం కార్యాలయం వివరణ ఇచ్చింది. ఈ వివరణపై తెలంగాణ బీజేపీ తన మార్క్ పంచ్‌లు విసురుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పేరు వింటేనే సీఎం కేసీఆర్‌కు జ్వరం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తే స్వాగతం పలికి ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తారా? సీఎం కేసీఆర్ కుసంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ కేసీఆర్‌కు ఏముందని ఆయన నిలదీశారు.
‘అస్వస్థత వల్ల రాలేదని కుంటి సాకులు చెబుతుంటే జనం నవ్వుతున్నారు. మోదీ పేరు చెబితేనే కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చినట్లుంది. భయపడి ముఖం చాటేసినట్లున్నారు’అని ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల కేంద్ర సర్కార్, తెలంగాణ బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్న కేసీఆర్ తనకు జ్వరంగా ఉందంటే నమ్మేవాళ్లు ఎందరు? నిజంగా జ్వరంతో బాధపడుతున్నా తెలంగాణ సమాజం నమ్ముతుందా? బీజేపీతో కయ్యం కేసీఆర్‌ని చివరికి ఎలా మిగల్చనుందో అనే చర్చ సర్వత్రా సాగుతోంది.
కేసీఆర్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ ఆరితేరిన నేత. ఇలా ఒక్కో రాష్ట్రంలో బలంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను తయారు చేసుకుంటున్న బీజేపీ భవిష్యత్‌పై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.