సీఎం జగన్ ఆశయాలు బాగానే ఉన్నా.. అమలులో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్న సందర్భాలున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ.. ప్రతిపక్షాల కుట్రలతో ఎన్ని వాయిదాలు పడి చివరకు ఎలా మొదలైందో అందరం చూశాం.
ఇంకా కొన్ని చోట్ల కోర్టు కేసుల కారణంగా పట్టాల పండగా ఎప్పుడో తెలియని పరిస్థితి. ఇంగ్లిష్ మీడియం కూడా కోర్టు కేసుల వల్లే సందిగ్ధంలో పడింది. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ అనే కార్యక్రమం కూడా పదే పదే వాయిదా పడుతూ వస్తోంది.
జనవరి 2021 నుంచి దీన్ని అమలు చేయడం గ్యారెంటీ అన్నారు, కానీ అది సాధ్యం కాలేదు. తీరా ఇప్పుడు ఫిబ్రవరి 1 అని అంటున్నారు. అయితే ఈసారి సీఎం జగన్ నేరుగా రేషన్ పంపిణీపై ప్రకటన చేయడంతో ప్రజల్లో కాస్తో కూస్తో నమ్మకం కుదిరింది.
పనిలో పనిగా బియ్యం నాణ్యతపై కూడా ఆయనే పెదవి విప్పారు. సన్నబియ్యం, సన్నబియ్యం అంటూ ప్రతిపక్షాలు సవాళ్లు విసురుతున్న వేళ.. నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి.
రేషన్ బియ్యం నాణ్యత క్వాలిటీ ఏంటో, వాటిని దేనికి ఉపయోగించుకోవాలో అందరికీ తెలుసు. పేదలు మాత్రం నేటికీ అవే రేషన్ బియ్యంతో అన్నం వండుకుని పొట్ట నింపుకుంటున్నారు. తాజాగా నాణ్యమైన స్వర్ణరకం బియ్యం పంపిణీ గనక పూర్తి స్థాయిలో సాధ్యమైతే అంతకంటే వారికి సంతోషకరమైన వార్త ఇంకోటి ఉండదు.
అయితే క్వాలిటీలో ఏమాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం మాత్రం ఖాయం. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు అధికారులను హెచ్చరించారు జగన్. బియ్యం క్వాలిటీ బాగుందని నిర్థారించుకున్న తర్వాతే పంపిణీ చేయాలని, ప్రతి నెలా ఈ క్వాలిటీ చెకింగ్ జరగాల్సిందేనని, దీనికి కలెక్టర్లే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఇంటి వద్దకే రేషన్.. దేశానికే ఆదర్శం
దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. దీనికి వాహనాలు కావాలి, ప్యాకింగ్ చేయాలి, రేషన్ డీలర్లు కాకుండా ఇంకో ఇద్దరు మనుషులు కావాలి.. వాహనం ఇంటికి వెళ్లినప్పుడు లబ్ధిదారులు ఇళ్లవద్దే ఉండాలి.. ఆ తతంగం చాలా పెద్దది.
ఉదయాన్నే చద్దన్నం మూటగట్టుకుని పనులకి వెళ్లే రోజు-కూలీలు ఏ టైమ్ లో తీసుకోవాలో, ఎక్కడ తీసుకోవాలో ఇంకా అనుభవంలోకి రావాల్సి ఉంది. పనులపై పక్క ఊరికి వెళ్లేవారు, వలస జీవులకి కూడా ఇది కాస్త కష్ట సాధ్యం. ఇప్పటివరకూ ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో పోర్టబిలిటి అనే విధానం ఉపయోగించుకుని రేషన్ బియ్యం తెచ్చుకునేవారు పేదలు.
ఇకపై ఇంటి వద్దకే రేషన్ అంటే.. వాహనం వచ్చినప్పుడు వాళ్లు ఇంట్లో ఉండాల్సిందే అని తేలుతోంది. లేనిపోని ప్రయాస అనిపిస్తున్నా.. సక్సెస్ అయితే మాత్రం ఈ పథకం దేశానికే ఆదర్శంగా మారుతుంది. అందుకే జగన్ దీనిపై అంతగా ఫోకస్ పెట్టారు. కొన్ని ఇబ్బందులతో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయినప్పటికీ.. పూర్తిస్థాయి సాధ్యాసాధ్యాలపై ఫిబ్రవరి నెలలో ఓ అవగాహన వస్తుంది.