రాష్ట్రంలో ఓ ప్లాన్ ప్రకారం హిందూ దేవాలయాల మీద, విగ్రహాల మీద దాడులు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒక ప్రాంతం అని కాకుండా అన్ని ప్రాంతాల్లో తరచు ఏదో ఒక సంఘటన రిపోర్ట్ అవుతోంది.
ఇలాంటి కేసును డీల్ చేయాలి అంటే స్పెషల్ టీమ్ వుండాలి. అందులో కఠినమైన ఆఫీసర్లు వుండాలి. అలాంటి వారిని ఏరి కోరి కేటాయించి ఓ బృందాన్ని ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరే అవకాశం రాష్ట్రానికి వుంది.
సిబిఐ నేతృత్వంలోని అలాంటి బృందాన్ని తీసుకువచ్చి దానికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసం వుంది. ఈ దిశగా జగన్ ఎందుకు ఆలోచించడం లేదు అన్నది తెలియడం లేదు.
నిజానికి రాష్ట్రంలో పరిస్థితులు వికటిస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటవుతున్నాయి. ఈ అవకాశాన్ని వదలుకోకూడదనే పట్టుదలతో వారంతా వున్నట్లు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో కూడా ఈ మేరకు గట్టి ప్రచారం స్టార్ట్ చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ పోలీస్ తో దర్యాప్తులు చేయించేకన్నా, స్పెషల్ టాలెంట్ వున్న నేషనల్ లెవెల్ అధికారులను రప్పించడం ద్వారా జగన్ తన కృత నిశ్చయాన్ని చాటుకున్నట్లు అవుతుంది.
కేవలం కేమేరాలు పెట్టి ఊరుకుంటే సరిపోదు. జనాలను ఆలయాల రక్షణలో భాగస్వాములను చేయాలి. ఆలయాల పరిరక్షణ కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాకూడదు. అలా చేయడం అన్నది అసాధ్యం కూడా.
ఆలయాల్లో అపచారం జరుగుతోందని వాపోతే సరిపోదు. దాన్ని అరకట్టడానికి మన బాధ్యత ఏమిటన్నది కూడా చూడాలి. తీసుకోవాలి. అందువల్ల ఆలయ రక్షణ కమిటీలు అనే కొత్త ఐడియాను జగన్ తీసుకోవాల్సి వుంటుంది.
స్థానికంగా ఆసక్తి వున్నవారు ముందుకు రావాలని సచివాలయాల ద్వారా కోరాలి. వాటిని ఏర్పాటుచేయాలి. దీనికి సహకరించమని విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్, భాజపా జనాలనే కోరాలి. అవసరం అయితే వారి జనాలనే తీసుకోవాలి. తన ప్రభుత్వం మీద మచ్చ పడకుండా చూసుకోవడం ముఖ్యం కానీ, ఎవరు పూనుకుంటే ఏమి?
కొత్త ఆలయాలు అన్నీ ఊళ్ల మధ్యలో వుంటున్నాయి కనుక సమస్య తక్కువ. పురాతన ఆలయాలు, గ్రామ దేవతల గుడులు, మిట్టల మీద, కొండల మీద వున్న కోవెళ్ల మీదనే దుండగులు దృష్టి సారిస్తారు. అందువల్ల పోలీస్ ఇన్ ఫార్మ్ వ్యవస్థను జాగృతం చేయాలి.
కేవలం పతిపక్షాలను విమర్శించినంత మాత్రాన, ఆవేదన వ్యక్తం చేసినంత మాత్రాన పని జరగదు. కార్యాచరణ అవసరం. ఆ కార్యాచరణ కూడా ప్రజలకు కనిపించేలా వుండాలి.
అంతేకానీ కేవలం మాటలతో పరిస్థితి దాటేద్దాం అంటే మాత్రం వ్యవహారం వికటించే ప్రమాదం వుందని జగన్ ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది.