ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన అన్ని నిధులపై ఇంతకుముందే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి జగన్. ఈరోజు మోడీతో సమావేశం కావడానికి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈసారి మాత్రం జగన్ కేవలం 2 అంశాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తన ఢిల్లీ పర్యటన ఫిక్స్ చేశారు. ఎక్కువ అంశాల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం కంటే ముఖ్యమైన 2 అంశాలపై క్లారిటీ తెచ్చుకోవడమే లక్ష్యంగా జగన్ పర్యటన సాగబోతోంది.
ప్రధాని దృష్టికి జగన్ తీసుకెళ్లాలనుకుంటున్న ఆ రెండు అంశాల్లో ఒకటి రాజధానుల అంశం. ఏపీకి 3 రాజధానులు ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మోడీకి వివరిస్తారు జగన్. ఈ కీలక నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దీనివల్ల భవిష్యత్తులో కలిగే లాభాలేంటి అనే అంశంపై ప్రధానికి వివరణ ఇవ్వబోతున్నారు. దీంతో పాటు విశాఖ, కర్నూలు, అమరావతి అభివృద్ధికి నిధుల మంజూరుపై కూడా చర్చిస్తారు.
ఇక రెండో అంశం పోలవరం. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధుల్ని కూడా కేంద్రం విడుదల చేయలేదు. పైగా కేంద్రం వాటా నిధులు కూడా రిలీజ్ అవ్వలేదు. ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన హామీ తీసుకోవాలనుకుంటున్నారు జగన్. రాబోయే రెండేళ్లలో పోలవరాన్ని పూర్తిచేయడానికి సహకారాన్ని కోరబోతున్నారు. ఈ రెండు అంశాలతో పాటు మండలి రద్దుపై కూడా మోడీతో చర్చిస్తారు. పార్లమెంట్ కు చేసిన మండలి రద్దు తీర్మానాన్ని వీలైనంత త్వరగా ఆమోదించమని కోరుతారు.
ఈరోజు ఉదయం ఏపీ కేబినెట్ భేటీ ఉంటుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్తారు జగన్. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రధానితో భేటీ అవుతారు. కుదిరితే ఇదే పర్యటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిసే అవకాశం ఉంది.