దసరాను హిందువులు ఎంతో పవిత్రమైన పండగగా భావిస్తారు. ఈ పండుగ నాడు ఏదైనా ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుందని హిందువులు విశ్వసిస్తారు. ఆ నమ్మకంతో కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేస్తుంటారు. దసరాను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన పంపిన సందేశం చాలా ఆలోచనాత్మకంగా ఉంది. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు.
అలాగే జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని ఆయన కోరుకున్నారు. జగన్ సందేశంలో పరమార్థం ఉంది. అది అర్థం చేసుకునే వాళ్లకు చేసుకున్నంత అనేలా ఉంది.
తన సందేశంలో చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని చెప్పడం పైకి మామూలుగా కనిపించినా ….అందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది. దసరా సందేశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం కాదు కానీ , సహజంగా ఈ మాటలు వింటే… ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తప్పక చెడు గుర్తుకొస్తుంది.
అలాగే చెడుపై భీకర పోరాటం, అంతిమ విజయం మంచినే వరిస్తుందనే భరోసా జగన్ మాటలు నింపుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ చెప్పిన మంచీచెడుల గురించి అర్థం కావాల్సిన వాళ్లకు అర్థమయ్యే ఉంటుంది.