కోర్టులు..ఆంధ్ర ప్రభుత్వం మధ్య వచ్చిన అనుమానాలు కావచ్చు, అపోహలు కావచ్చు, కాస్త సద్దు మణిగాయి. ప్రస్తుతం అంతా యుద్దం ముందు ప్రశాంతత అనుకోవాలో, లేదా ఇరు వర్గాల మధ్య పరిస్థితి మీద కాస్త అవగాహన కలిగిందనుకోవాలో, మొత్తం మీద కొంత స్తబ్దు వాతావరణం అయితే నెలకొంది.
జగన్ లేఖ రాసిన మరునాటి నుంచి అనేక వార్తా కథనాలు, వ్యాఖ్యలు కనిపించాయి. అనకూడదు కానీ వైఎస్ జగన్ న్యాయమూర్తుల వ్యవహారాన్ని తన లేఖలో బయటకు లాగిన దానికన్నా ఈ వార్తా కథనాలు, వ్యాఖ్యలు చేసిన హడావుడి ఎక్కువ. నిజానికి జగన్ లేఖ అనంతర ఆయన ను సదా వ్యతిరేకించే మీడియా కనుక ఇంత అతిగా స్పందించకుండా వుండి వుంటే సామాన్య ప్రజానీకానికి ఈ వైనం పట్టేది కాదు. జనాల్లో ఆలోచనలు ప్రారంభమయ్యేవి కాదు.
సాధారణంగా న్యాయం అందరికీ సమానం అనే మాట మనం వింటూ వుంటాం. కానీ అదే న్యాయం దేని మీద ఆధారపడుతుంది. బలమైన వాదన మీద. ఆ వాదనకు బలం చేకూర్చే సాక్ష్యాధారాల మీద. అందుకే ప్రతి ఒక్కరు తమ కేసు కోసం వీలయినంత మంచి న్యాయవాది లేదా గట్టి లాయర్ ను పెట్టుకోవాలని అనుకుంటారు. అలా గట్టివారు అనుకునేవారు అందరికీ అందుబాటులో వుండరు.
ఎందుకంటే ఈ దేశంలో గంటల లెక్కన, సలహాల లెక్కన, విజిట్ ల లెక్కన లక్షల్లో ఫీజులు తీసుకునే ప్రముఖ లాయర్లు వున్నారు. మరి గట్టి లాయర్ ను పెట్టుకోకపోతే, కేసు గెలవలేము అన్నపుడు న్యాయం అందరికీ సమానం ఎలా అవుతుంది అన్నది కామన్ మాన్ ప్రశ్న.
ఇద్దరు వ్యక్తులు కోర్టుకు ఎక్కినపుడు ఇద్దరిలో ఒకరు బలమైన లాయర్ పెట్టుకోగలిగినపుడు, మరొకరు అంత ఆర్థిక స్థొమతలేనపుడు న్యాయం సక్రమంగా లభిస్తుందా? వాదనలను బట్టి, సాక్ష్యాధారాలను బట్టి తీర్పులు వుంటాయి అని చెబుతున్నపుడు సరైన వాదన లేకుండా న్యాయం లభిస్తుందా? ఎందుకీ అనుమానం అంటే ప్రభుత్వం తరపున సరైన విధంగా వాదన ప్రెజెంట్ చేయకపోవడం వల్లనే కేసుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయి తప్ప, అంతకన్నా మరేం లేదు.
ఇందులో లోపాయకారీ వ్యవహారాలు లేవు అన్నది ప్రతిపక్ష మీడియా మాట. కాస్సేపు అదే నిజం అనుకుందాం. అంటే ప్రభుత్వ నిర్ణయాల తప్పు కాదు, ప్రభుత్వ నిర్ణయాలు కోర్టుల్లో నిలబడకపోవడానికి వాటి తరపున వాదించిన వారి సత్తా తప్పు అనుకోవాలా?
వాదనను బట్టి, సాక్ష్యాధారాలను బట్టి తీర్పులు వుంటాయి అన్నది అందరూ చెప్పే మాట. దాని ప్రకారం చూస్తే, వచ్చిన తీర్పు సరైనది లేదా సరైనది కాదు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అది అందుబాటులో వున్న, లేదా కోర్టుకు అందిన సాక్ష్యాధారాలను బట్టి ఇచ్చిన తీర్పు మాత్రమే కదా.
అసలు ఇలా ఎందుకు అనాల్సి వస్తోంది అంటే కోర్టులతో ఆంధ్ర ప్రభుత్వానికి వివాదం వచ్చిన నేపథ్యంలో అనేకానేక సోషల్ మీడియా పోస్టులు కనిపించాయి. వీటిలో కొన్ని ఆలోచింపచేసేలా వున్నాయి. లా చదివిన రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా మాట్లాడారు. ఆయన మాటలు వింటుంటే, వాటిల్లో దొర్లిన కోర్టు వ్యవహారాలను తెలుసుకుంటూ వుంటే కామన్ మాన్ కు భలే ఆశ్చర్యం కలుగుతుంది.
ఎందుకు? ఎలా? దేనివల్ల? అన్నది పక్కన పెడితే చంద్రబాబు కేసులు కావచ్చు, తెలుగురాష్ట్రాల విభజన కేసు కావచ్చు. ఇప్పటికీ ఓ కొలిక్కిరాకపోవడం ఏమిటి? అన్న అనుమానాలు రావడం సహజం.
ఎల్ జి పాలిమార్స్ నిర్వహణలో దాని యాజమాన్యం చేసిన తప్పేమిటి? స్వర్ణ ప్యాలస్ క్వారంటైన్ సెంటర్ నిర్వహణలో దాని యాజమాన్యం కావచ్చు లేదా దాన్ని లీజుకు తీసుకున్నవారు కావచ్చు చేయని తప్పేమిటి? అన్న సందేహాలు సోషల్ మీడియాలో కనిపించాయి అంటే సహజమే కదా? సరే కోర్టుల సంగతి పక్కనపెడితే మీడియా కూడా ఎల్ జి పాలిమర్స్ ను ఒకలా, స్వర్ణ ప్యాలస్ ను మరోలా ఎందుకు చూసినట్లు? రెండింటికీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది.
వీళ్లను క్వారంటైన్ సెంటర్ నడుపుకోవడానికి, వాళ్లకు ఫ్యాక్టరీ నడుపుకోవడానికి. మరి అక్కడ ప్రభుత్వ బాధ్యత కన్నా యాజమాన్య బాధ్యత ఎక్కువ, ఇక్కడ యాజమాన్య బాధ్యత కన్నా ప్రభుత్వ బాధ్యత ఎక్కువ అనే మాట వినిపించేసరికి సామాన్యుడు కాస్త అయోమయానికి గురి కావడం సహజం. ఎందుకంటే సామాన్యుడికి న్యాయసూత్రాలు తెలియవు కదా.
అదీ విభజనంటే..
ఇంకో పాయింట్ కూడా భలే గమ్మత్తుగా వినిపించింది సోషల్ మీడియాలో. సమైక్య ఆంధ్ర విభజన సమయంలో పార్లమెంట్ లో జరిగిన విషయాలు అందరికీ తెలిసిందే. ఎంత గందరగోళం జరిగిందో అందరికీ తెలిసిందే. తలుపులు ఎలా మూసారో? లైవ్ టెలికాస్ట్ ఎలా ఆపారో? లోపల ఏం జరిగింది అన్నది ప్రజలకు తెలియకుండా చేయాల్సింది ఎంత చేసారో? మరి దానితో పోల్చుకుంటే మూడు రాజధానుల బిల్లు విషయంలో ఆంధ్ర చట్టసభల్లో జరిగింది ఎంత? అస్సలు అంతటి గడబిడే లేదు.
కానీ విభజన వ్యవహారంలో ఉండవల్లి వేసిన పిటిషన్ అలాగే వుంది ఇప్పటికీ అంటారు ఆయన. పార్లమెంట్ ప్రొసీడింగ్స్, విడియో రికార్డులు కోర్టుకు ఎప్పుడు వస్తాయో మరి? కానీ మన చట్టసభల వ్యవహారంలో మాత్రం మొత్తం ప్రొసీడింగ్స్, రికార్డులు, విడియోలు కోర్టుకు అందించాల్సిన తరుణం వచ్చేసింది.
ఏమిటిదంతా? ఎక్కడ వుంది లోపం? కేసులు ఎక్కువున్నాయా? తక్కువున్నాయా? ప్రాధాన్యతా క్రమం ఏమిటి? ఇవన్నీ లీగల్ పాయింట్లు. కామన్ మాన్ కు ఇవన్నీ తెలియవు. ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాలో వచ్చే రకరకాల కథనాలు కామన్ మాన్ ను మరింత అయోమయానికి గురి చేస్తాయి.
కచ్చితంగా కోర్టులు వున్నది ప్రజల నుంచి ఎన్నికైన ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా చూడడానికే. అందులో సందేహం లేదు. కానీ అదే సమయంలో ప్రజల నుంచి ఎన్నికైన ప్రభుత్వాలు సజావుగా పని చేసే వాతావరణం కూడా కోర్టులు కల్పించాలి. అయినదానికీ, కానిదానికీ, చీటికీ మాటికీ ఏదో రూపంలో ప్రతిపక్షాలు అడ్డం పడాలని చూస్తున్నపుడు, ఆ వైనం అర్థం కాకుండా వుండడానికి, తెలియకుండా వుండడానికి అదేమీ పెద్ద పజిల్ కాదు.
ఎందుకంటే న్యాయమూర్తులు కూడా సమాజంలో, జన బాహుళ్యంలో భాగమే. ఆంధ్రలో నడుస్తున్న రాజకీయాలు వారికి తెలియనివి కావు. అయితే అలా అని కోర్టు గుమ్మం ఎక్కినవారిని, పిటిషన్ వేసిన వారిని వద్దని ఎవ్వరూ అనే పరిస్థితి వుండదు. కానీ ఇవే కోర్టులు గతంలో అనేక చిల్లర పిటిషన్లు, పిల్స్ వేసిన వారిని మందిలించిన సందర్భాలు, ఫైన్ విధించిన సందర్భాలు వున్నాయి. ఎందుకంటే విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసారు కనుక.
మరీ ఇన్ని పిటిషన్లా?
ఆంధ్రలో కూడా కనీసం ఒక్క పిటిషన్ ను అయినా ఇలా చేసి వుంటే ఈ విచ్చలవిడి పిటిషన్ల తాకిడి ఇంతలా వుండి వుండేది కాదేమో? ఇదిలా వుంటే జనబాహుళ్యంలో వున్న మరో అమాయకుపు అనుమానం కూడా వుంది. పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోకుండా, న్యాయం జరగకుంటే, ఎవరైనా కోర్టుకు వెళ్తారు. అప్పుడు కోర్టు ఏం అంటుంది.
ఆ కేసును తీసుకోమని లేదా విచారించమని పోలీసులను ఆదేశిస్తుంది. విషయం ఏదో ఒకటి ముందు తెలుసుకోమంటుంది. అందులో అన్యాయం వుందా న్యాయం వుందా? ఏదో ఒకటి తెలుసుకని చెప్పమంటుంది. తెలుగుదేశం టైమ్ లో అన్న క్యాంటీన్లకు పసుపు రంగు వేస్తే లేని అభ్యంతరం సచివాలయాలను నీలం రంగు వేస్తే ఎందుకు వచ్చిందో కామన్ మాన్ కు చెప్పేది ఎవరు? అన్న క్యాంటీన్ల మీద అతి పెద్ద ఎన్టీఆర్ బొమ్మ పెడితే లేని అభ్యంతరం వేరే చోట జగన్ బొమ్మ పెడితే ఎందుకు వచ్చిందో ఎవరు చెబుతారు?
మరి అలాంటి కోర్టు ప్రభుత్వం అమరావతి భూముల విషయంలో విచారిస్తాం అంటే ఎందుకు వద్దు అంటుంది? అన్నది కామన్ మాన్ అనుమానం. పైగా పెద్ద మనుషుులు, గొప్పవారు ఈ పని చేసారు, దీనిపై విచారణ చేస్తున్నాం అని ప్రభుత్వం అంటే వద్దు, ఆపేయండి, అసలు ఆ విషయాలు ఏవీ ఎక్కడా ప్రస్తావించకండి అని కోర్టు అన్నది అంటే కామన్ మాన్ మట్టి బుర్రకు లేదా చిన్న బుర్రకు అర్థం కాదు కదా? ఇక్కడ లా పాయింట్లు ఏమిటి? అన్నది న్యాయకోవిదులే చెప్పాలి.
న్యాయ వ్యవస్థ అత్యున్నతం
ఎందుకంటే ఈ దేశంలో ప్రధాని మీద అయినా, రాష్ట్రపతి మీద అయినా ఎవరైనా విమర్శ లేదా ఆరోపణ చులాగ్గా చేసేయవచ్చు. ఏ కేసు వుండదు. భయమూ వుండదు. పోలీసుల మీద టాప్ పోలీసుల మీద కూడా ఆరోపణ లేదా విమర్శ చేసేయవచ్చు. అక్కడా ఏ కేసు వుండదు.
పోలీసులు ఏదైనా చేస్తారేమో అన్న భయం తప్ప. కానీ న్యాయవ్యవస్థ అలా కాదు. గౌరవ న్యాయమూర్తులు ఎవరైనా, అది సబ్ జడ్జి దగ్గర నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు ప్రత్యేక, విశేష అధికారాలు వుంటాయి. కలెక్టర్ చాంబర్ దగ్గర ఎవరైనా కాస్త గట్టిగా మాట్లాడినా, అల్లరి చేసినా, బయటకు తోసేయిస్తారు. లేదా పంపేస్తారు. అంతే. అదే కోర్టులో అయితే ఫైన్ వేయొచ్చు, రోజంతా కోర్టులో నిలబడి వుండమని ఆదేశించవచ్చు. ఇంకా ఏదైనా సరే. ఎందుకంటే న్యాయవవస్థ కు ఈ దేశంలో అపార గౌరవం, విశేష అధికారాలు వున్నాయి కనుక.
న్యాయమైన చర్చలు
అందువల్ల న్యాయ సూత్రాలు, కేసులు, ఆరోపణలు ఇటీవల సొషల్ మీడియా వరకు ఎక్కిన నేపథ్యంలో మీడియాలో జరపాల్సింది అడ్డగోలు చర్చలు కాదు. న్యాయ కోవిదులను పిలవాలి. పిలిచి ఏం చేయాలి? ఓ రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ నిపుణులు కూర్చుని పోస్ట్ మార్టం చేస్తారు. ఈ కారణంగా ఓడిపోయింది. వీళ్లు ఓట్లు వేయలేదు. వాళ్లు వేసారు. ఇలా.
అదే విధంగా మీడియా ముందు న్యాయ నిపుణులైన లాయర్లు కూర్చుని ఈ కేసు ఇందుకు వీగిపోయింది వుంటుంది. ఈ కేసుపై ఇందుకు స్టే వచ్చి వుంటుంది. ఈ పిల్ ను ఇందుకు అంగీకరించి వుంటారు. అంటూ వివరిస్తే అర్థవంతంగా వుంటుంది.
ఎంతసేపూ రాజకీయ నాయకులే ఈ కోర్టు వ్యవహారాల డిస్కషన్ లోనూ కూర్చుని, ఎవరి దమ్ము వారు చూపిస్తూ, ఎవరి దుమ్ము వారెత్తిపోస్తూ వుంటే ఎలా? న్యాయకోవిదులు విపులంగా చెబితే కామన్ మాన్ కూడా ఇదీ 'లా', ఇదిలా అని అర్థం అవుతుంది. అప్పుడు లేనిపోని అనుమానాలు వుండవు. రేకెత్తించినా నడవ్వు.
ఇక్కడ కామన్ మాన్ కు ఎందుకు ఇవన్నీ అవసరం అని ఎవరైనా అడొగొచ్చు. ఎందుకే కొన్ని కోర్టు తీర్పుల పర్యవసానం కామన్ మాన్ మీదే కదా? ఇళ్లస్థలాలపై కేసు నడుస్తోంది. పాపం ఎందరో ఇళ్ల స్థలాల కోసం చూస్తున్నారు. వాళ్లకు పరిస్థితి అర్థం కావాలి కదా? ఇలాగే అనేక కేసులు చివరకు వెళ్తే కామన్ మాన్ ఆశలు, కోరికలు, అభీష్టాలు వుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అయినా అసలు ఏం జరుగుతోందో వారికి చెప్పాలి కదా?
చాణక్య