కార్పొరేట్ స్కూళ్లను చావుదెబ్బ తీసిన జగన్

జగన్ కొట్టే దెబ్బకి ఏపీలోని కార్పొరేట్ స్కూళ్లకు కూసాలు కదిలిపోతున్నాయి. ఇన్నాళ్లూ అడ్డదిడ్డంగా ఫీజులు వసూలు చేసినవారంతా బిక్కచచ్చిపోతున్నారు. తమ విద్యా వ్యాపారానికి గండి పడిందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ…

జగన్ కొట్టే దెబ్బకి ఏపీలోని కార్పొరేట్ స్కూళ్లకు కూసాలు కదిలిపోతున్నాయి. ఇన్నాళ్లూ అడ్డదిడ్డంగా ఫీజులు వసూలు చేసినవారంతా బిక్కచచ్చిపోతున్నారు. తమ విద్యా వ్యాపారానికి గండి పడిందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు స్కూళ్లకు సెలవలిచ్చి బంద్ కూడా పాటించారు. అయితే జగన్ మాత్రం వారిపై ఒకేసారి వేటు వేయడంలేదు. క్రమక్రమంగా వేటు వేస్తున్నారు. ఇటు ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు మెరుగు పరుస్తూ, ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మారుస్తూ పనికానిచ్చేస్తున్నారు.

తాను అధికారంలోకి వస్తే పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్లేలా చేస్తానని, ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఒకేసారి దెబ్బ కొట్టకుండా విడతల వారీగా మోతమోగిస్తున్నారు. ఇప్పటికే పల్లెటూళ్లలో సగం మంది భేషజాలు, మొహమాటాలు వదిలేసి సర్కారు బడులకు పిల్లల్ని పంపిస్తున్నారు. విద్యాకానుక కిట్లు అందుకుంటున్నారు.

ఈ ఏడాది కొత్తగా విద్యా కానుకలో డిక్షనరీ ఇచ్చిన ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి స్పోర్ట్స్ షూస్, స్పోర్ట్స్ డ్రస్ కూడా ఇస్తానంటోంది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషీ. ఈ ఒక్క విషయానికి అట్రాక్ట్ అవుతారని చెప్పలేం కానీ, ఇది మరో ముందడుగేనని చెప్పాలి. విద్య బాగుంది, సౌకర్యాలున్నాయి, అన్నిటికీ మించి బోధన ఉచితం, డ్రస్సులు, పుస్తకాలు, బూట్లు అన్నీ ఉచితం, సీబీఎస్ఈ సిలబస్ కూడా చెబుతామంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.

పేద, ధనిక తేడాల్లేవు..

ప్రస్తుతం పేద విద్యార్థులంతా ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తారు, వేలకు వేలు ఫీజులు కట్టే స్థోమత ఉన్నవారంతా తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తుంటారనే ప్రచారం ఉంది. కాన్వెంట్ చదువుల మోజులో పడి కొంతమంది తమ పిల్లల్ని అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. అలాంటి వారంతా ఈ ఏడాది ఆలోచనలో పడ్డారు. 

గతేడాది ఆన్ లైన్ క్లాసుల పేరుతో హడావిడి చేసి మరీ ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ స్కూల్స్, ఈ సారి కూడా అదే బాదుడు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులొస్తున్నాయి. ఉచితంగా పుస్తకాలిచ్చి, బట్టలిచ్చి, డిక్షనరీలిచ్చి, బ్యాగులిచ్చి, షూస్, స్పోర్ట్స్ షూస్, స్పోర్ట్స్ డ్రస్ కూడా ఇస్తూ చదువుకోమని చెబుతుంటే.. అలాంటి అవకాశాన్ని ఎందుకు వదిలేసుకోవాలని ఆలోచిస్తున్నారు.

అదే సమయంలో ప్రైవేట్ స్కూల్స్ కూడా పునరాలోచనలో పడ్డాయి. ప్రభుత్వ స్కూళ్ల ధాటిని తట్టుకోడానికి కష్టాలు పడుతున్నాయి. అయితే నాడు-నేడు పనులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలతో ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతూ, పరోక్షంగా కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేస్తున్నారు జగన్.