పబ్లిక్ వినాయకుడు కాదు, ప్రైవేటు గణపతే..!

ఏపీలో వినాయక చవితి పండగ ఆంక్షలపై హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుని ఎవరికి వారు తమ విజయంగా చెప్పుకోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.  Advertisement ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అంటూ ఓ…

ఏపీలో వినాయక చవితి పండగ ఆంక్షలపై హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుని ఎవరికి వారు తమ విజయంగా చెప్పుకోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. 

ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అంటూ ఓ వర్గం మీడియా ఊదరగొడుతోంది, హిందువుల విజయం అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. వైసీపీ అనుకూల వర్గం మాత్రం ఆంక్షలు సబబేనని హైకోర్టు చెప్పినట్టు వార్తలిస్తోంది.

అసలింతకీ ఏది నిజం.. ఎంత నిజం..?

పబ్లిక్ ప్లేస్ లో వినాయక మండపాలు వద్దు, ప్రైవేటు ప్లేసుల్లో అది కూడా ఐదుగురికంటే ఎక్కువగా చేరకుండా జాగ్రత్తలు వహించాలని సూచించింది కోర్టు. అంటే పబ్లిక్ గా ఎక్కడా రోడ్లపైన, ఇతర ప్రభుత్వ స్థలాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయడం కుదరదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. 

ప్రైవేటు స్థలాలు అంటే.. ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాల్లో మాత్రమే వినాయకుడి విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఇలాంటి స్థలాలు కావాలంటే చాలానే ఉంటాయి. కానీ గతంలో లాగా రోడ్డుకి అడ్డంగా పందిరి వేయడం, విగ్రహం పెట్టడం కుదరదన్నమాట.

ఇక పోతే ఐదుగురికంటే ఎక్కువగా భక్తులు మండపంలోకి రావొద్దు అనే ఆంక్షలు మాత్రం కాస్త ఇబ్బంది కలిగించేవే. వినాయక చవితి పండగ అంటే, మండపంలో సందడి,.. ఆ హంగామానే వేరు. మరీ ఇంత సింపుల్ గా చేసుకోవాలని చెప్పడం ఎవరినీ మెప్పించడంలేదు. అలాగని ఐదుగురుకంటే ఎక్కువగా మండపాల వద్దకు చేరకుండా ఉంటారా అంటే అదీ లేదు. కోర్టు అనుమతిచ్చింది కాబట్టి మేం పండగ ఘనంగా చేస్తామంటూ బీజేపీ, టీడీపీ, జనసేన రెచ్చిపోవడం ఖాయం.

ఐదుగురికంటే ఎక్కువమంది గుమికూడితే.. పోలీసులు బడితె పూజ చేయడం కూడా ఖాయమే. ఇక్కడ హైకోర్టు ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు పెట్టుకోడానికి అనుమతి ఇవ్వడం మరో పెద్ద సమస్యకు దారి తీస్తుందనే అనుమానాలున్నాయి. అసలే అధికార పక్షం, వైరి పక్షాల మధ్య ఇదో పెద్ద ఇమేజ్ ప్రాబ్లమ్ గా మారింది. కోర్టు తీర్పుని అడ్డు పెట్టుకుని ఇరు వర్గాలు ఇప్పుడు ఒకరిపై ఒకరు రెచ్చిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

పండగ సందడి లేనిమాట వాస్తవం..

కరోనా భయం ఓ పక్క, ప్రభుత్వం ఉత్తర్వులు మరో పక్క ఉండటంతో.. చాలా చోట్ల పల్లెల్లో ఏర్పాట్లు ఆగిపోయాయి. చందాల వసూళ్లు, బొమ్మకి అడ్వాన్స్ లు అంతా నెమ్మదించాయి. తీరా ఇప్పుడు బీజేపీ సహా ఇతర పార్టీలు, కొన్ని హిందూ ధార్మిక సంఘాలు హడావిడి చేసి బొమ్మ పెట్టి తీరతాం, పండగ చేసి తీరతామంటూ కొంతమందిని రెచ్చగొట్టాయి.

కోర్టు తీర్పుతో ప్రైవేటు స్థలాల్లో మండపాల ఏర్పాటుకి అనుమతి వచ్చినా.. పండగ సందడి మాత్రం ఈ ఏడాది బాగా తక్కువేనని చెప్పాలి. ఎక్కడికక్కడ, ఎవరికి వారు ఇళ్లలో పండగ జరుపుకోడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ వినాయక చవితి తర్వాత ఏపీలో కరోనా కేసుల లెక్క పెరిగితే మాత్రం ఆ పాపం కచ్చితంగా బీజేపీ ఖాతాలోనే పడుతుంది.