అవును ఆయన ఘనమైన అధికారి. ఈ రోజుల్లో ఎవరూ ఊహించిని నిజయతీ ఆయన సొంతం. ఆయన పనిచేస్తున్న గనుల శాఖ అంటే బంగారమే అంటారు. అలాంటి శాఖలో ఆయన కీలకమైన పదవిలో ఉంటూ కూడా పైసా అవినీతిని సహించే వారు కాదని పేరు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన గనుల శాఖ ఏడీ ప్రతాపరెడ్డి.
అవినీతి పరులు, అక్రమార్కుల గుండెలలో ఆయన నిద్రపోయారనే చెప్పాలి. గత కాలపు పాతవాసనలతో ఉన్న అధికారుల బూజు కూడా దులిపారు. అదే టైమ్ లో కొండను దొలిచేసినట్లుగా గనులను దొలిచేస్తూ సర్కారీ సొమ్ముని దోచుకుంటున్న వారి తాట తీశారు.
ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని మిగిలించారు. భారీ జరీమానాలు విధించి మరీ ఖజానాకు సొమ్ము చేరవేశారు. అలాంటి ప్రతాపరెడ్డి కి సడెన్ గా బదిలీ అయింది. విశాఖ జిల్లాలో మైనింగ్ మాఫియా భరతం పట్టిన ఈ అధికారి బదిలీ కావడం అంటే అవినీతి ఘనులకు రెక్కలు వచ్చినట్లే అని అంతా భావిస్తున్నారు.
మరి తాను నిజాయతీగా పనిచేయడం సొంత శాఖలోని అధికారులకు కూడా నచ్చని వ్యవహారమైనపుడు ఆయనకు ఆయనే బదిలీ చేయించుకున్నారా లేక ఎవరైనా ఆయన స్థానాన్ని కదిల్చారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా అవినీతి గనులకు మాత్రం ఇది అతి పెద్ద ఊరటగానే ఈ పరిణామాన్ని చెప్పుకుంటున్నారు.