జగన్ ఎప్పుడూ ఓ అడుగు ముందుకే..!

ఇటీవల కరోనా టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన స్నేహితులు, బంధువులు ఎవరిని పలకరించినా ఒకటే సమాధానం. “నాకే లక్షణాలు లేవు, అయినా పాజిటివ్ వచ్చింది. నాకు జలుబు కూడా లేదు, అయినా ఆస్పత్రికి తీసుకెళ్లారు”.…

ఇటీవల కరోనా టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన స్నేహితులు, బంధువులు ఎవరిని పలకరించినా ఒకటే సమాధానం. “నాకే లక్షణాలు లేవు, అయినా పాజిటివ్ వచ్చింది. నాకు జలుబు కూడా లేదు, అయినా ఆస్పత్రికి తీసుకెళ్లారు”.

అసింప్టమాటిక్ కేసులతో పెద్దగా భయంలేదని డాక్టర్లు చెబుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ అడుగు ముందుకేసింది. కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినప్పటికీ, ఎలాంటి లక్షణాలు లేకపోతే హోమ్ ఐసోలేషన్ లో ఉండేటట్లు అనుమతులిస్తున్నారు. అయితే స్థానిక అధికారులు, వైద్యుల విచక్షణ మేరకే ఈ నిర్ణయం అమలవుతోంది.

తాజాగా ఆరోగ్యశ్రీ విస్తరణ పథకాన్ని ప్రారంభించే సందర్భంలో కలెక్టర్లతో మాట్లాడిన సీఎం జగన్.. హోమ్ ఐసోలేషన్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. “కరోనా వస్తుంది, పోతుంది.. భవిష్యత్ లో కరోనా సోకని వారంటూ ఎవరూ ఉండరేమో” అంటూ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అసింప్టమాటిక్ కేసుల్ని చూస్తుంటే జగన్ మాటలు అక్షర సత్యాలని రుజువవుతున్నాయి.

కరోనా వచ్చినట్టు తెలియకుండానే చాలామందిలో తగ్గిపోయింది. అలాంటివారి వల్ల అది ఇతరులకు సోకిన దాఖలాలు ఏపీలో కనిపించలేదు. ప్రస్తుతం పాజిటివ్ గా తేలుతున్న వారిలో సగం మందికి లక్షణాలు ఉండటంలేదు. ఇలాంటి సందర్భంలో అందరినీ తీసుకెళ్లి ఆస్పత్రుల్లో చేర్చాలంటే వసతులు సరిపోవు. అసలైన బాధితులకు వైద్యం అందకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. ఆస్పత్రుల్లో చేరి మానసిక వ్యథతో లేనిపోని రోగాలు తెచ్చుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

దీంతో జగన్ ఫార్ములాయే ఇప్పుడున్న ఏకైక ప్రత్యామ్నాయం. హోమ్ ఐసోలేషన్ ని అమలు చేసి, నిత్యం వారి ఆరోగ్య పరిస్థితుల్ని వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తూ వైద్యం అందిస్తే కరోనా భయం పూర్తిగా తొలగిపోతుంది. పాజిటివ్ వచ్చినవారందర్నీ ఆస్పత్రుల్లో చేర్చుకుంటూ పోతే.. రాష్ట్రంలోనే కాదు, ఏ దేశంలోనూ వైద్య సేవలు సరిపోవు. ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయం మరో ముందడుగేనని చెప్పాలి.

తెలంగాణతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉన్నప్పటికీ ఏపీలో దీనికి ఎక్కువ ప్రాచుర్యం కల్పిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నారు జగన్. ఇంట్లో ఎక్కువ గదులుండి హోమ్ ఐసొలేషన్ లో ఉండడానికి మొగ్గుచూపే వాళ్లకు ఐసొలేషన్ కిట్స్ అందించాలని జగన్ సూచించారు. ఇంట్లో ఐసొలేషన్ లో ఉండడానికి వసతి లేని వాళ్లను హాస్పిటల్ కు తరలిస్తారు. 

బాలినేని మీద బురద చల్లొద్దు

బండ్ల గణేష్ కూడా సెలెబ్రిటీయేనా?