ఇది ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ కాదు. టీడీపీ నేతలు తమకుతాముగా పెట్టుకున్న టైటిల్. అవును.. పార్టీ వ్యవహారంపై వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ రెచ్చిపోయారు టీడీపీ నేతలు. పచ్చపాత మీడియాతో విషం చిమ్మించారు. కట్ చేస్తే.. ఇప్పుడు టీడీపీ ఎంపీల బృందం హస్తినకు వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసి వచ్చింది. మరి కరోనా కాలంలో టీడీపీ ఎంపీలు ఎందుకు గడప దాటినట్టు. ఏపీలో రాజ్యాంగాన్ని పరిరక్షించండి అంటూ వైసీపీపై టీడీపీ ఎంపీలు చేసిన ఫిర్యాదులో పస ఉందా? అసలు వారి వాదన ఎవరైనా విన్నారా..?
వాస్తవానికి టీడీపీ ఎంపీలకు కనీసం కూర్చుని సావకాశంగా మాట్లాడే అవకాశమే ఢిల్లీలో లభించ లేదు. రామ్ నాథ్ కోవింద్ సహా, కేంద్ర మంత్రి తోమర్ కార్యాలయంలో కూడా వారికి ఐదు నిమిషాల అపాయింట్ మెంట్ మాత్రమే దొరికింది. ఈమాత్రం దానికే.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నిటిపై వారు కేంద్రంలోని పెద్దలకు వివరించినట్టు, వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్టు పచ్చపాత మీడియా హోరెత్తించింది.
వాస్తవానికి జరిగిందేంటంటే.. టీడీపీ ఎంపీలు వెళ్లి.. అక్కడ వినతిపత్రం ఇచ్చి ఫొటోలు దిగి వచ్చారు అంతే. అంతమాత్రానికే వారి వినతి పత్రంలోని అంశాలను హైలెట్ చేసి, రాష్ట్రంపై కేంద్రం ఏదో చర్యలకు దిగబోతోంది అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అయితే ఈ పర్యటన వెనక బీజేపీలో చేరిన టీడీడీ మిడతల దండు ఉందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.
ఢిల్లీ స్థాయిలో కాస్త హడావిడి చేయాలని, తద్వారా రాష్ట్రంలో ఏదో జరగబోతోందనే భ్రమ కల్పించాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఎంపీలు ఇలా సూట్ కేస్ సర్దుకుని హస్తినబాట పట్టారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే.. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న ఆయన.. రాష్ట్ర వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటారో టీడీపీ నేతలకే తెలియాలి.
వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుతో అధికార మార్పిడి జరుగుతున్న సందర్భంలోనే.. రాజ్యాంగ వ్యవస్థలు ఏమీ చేయకుండా మిన్నకుండిపోయాయి. అలాంటిది.. ఏడాది పాలనతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని, కరోనా కష్టకాలంలో నివారణ చర్యలతో దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న సీఎం జగన్ పై రాష్ట్రపతికి టీడీపీ ఫిర్యాదు చేయడం విడ్డూరం కాక మరేంటి? అయినా కూడా వీళ్లు తగ్గరు. అయిననూ పోయి రావలె హస్తినకు.