భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య పది లక్షల నంబర్ ను దాటేసింది. నిన్న నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య పది లక్షలను దాటిందని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినట్టుగా అయ్యింది. దేశంలో ఇప్పటి వరకూ 10,04,806 కరోనా కేసులు రిజిస్టర్ అయినట్టుగా సమాచారం. వీటిల్లో రికవరీ శాతం 65 వరకూ ఉంది. మిగిలినవి యాక్టివ్ కేసులు.
అయితే రికవరీ శాతం దేశంలో బాగానే ఉన్నా, కొత్త కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతుండటంతో పరిస్థితి ఎప్పటికి నియంత్రణలోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగానే మిగులుతోంది. గురువారం నమోదైన కేసుల సంఖ్యనే పరిశీలిస్తే..36,139 గా ఉంది ఆ సంఖ్య. ఇదే సమయంలో గురువారం దాదాపు 23,000 మందికి నయం అయ్యి, వారిని డిశ్చార్జి చేసినట్టుగా సమాచారం. డిశ్చార్జిల సంఖ్య బాగానే ఉన్నా, అంతకు మించి ఎక్కువగా కొత్త కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంటూ ఉంది.
ఇది వరకూ ఒకే రోజు 32 వేల కేసుల వరకూ పెరిగాయి. అదే హయ్యెస్ట్ అనుకుంటే గురువారం నమోదైన కేసుల సంఖ్యతో కొత్త హయ్యెస్ట్ నమోదైందని తెలుస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కరోనా నంబర్లు పెరుగుతూ పోతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య అక్కడ ఎప్పటికిప్పుడు పెరుగుతూ ఉంది. వాటికి తోడు కర్ణాటక కూడా జాయిన్ అవుతోంది. గురువారం ఒక్కరోజే కర్ణాటకలో వందకు పైగా మరణాలు నమోదైనట్టుగా వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిన్న ఒక్క రోజే ఇలా వంద స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయని తెలుస్తోంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య నిన్నటితో 25 వేలను దాటిందని కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలా దేశంలో కరోనా ఉధృతి ఆందోళన కరంగానే కొనసాగుతూ ఉందని స్పష్టం అవుతోంది.