రెండు రోజులుగా ఓ మాజీ దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణ వ్యక్తి సమస్యను పట్టుకుని ఏదో చేయాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతల ఆరోపణలు బూమ్‌రాంగ్ అవుతున్నాయి. రామకృష్ణ వ్యవహారంపై గురువారం టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడాడు.
అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దల దౌర్జన్యానికి గురైన దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణ ఎనిమిదేళ్లుగా నరకయాతన అనుభ విస్తున్నాడని విమర్శించారు. ఇప్పుడు జరిగిన ఘటనకు ఎనిమిదేళ్ల ముందు నుంచీ రామకృష్ణ నరకయాతన పడుతున్నట్టు ఆయన బల్ల గుద్ది మరీ చెప్పాడు. కడప జిల్లాకు చెందిన జస్జిస్ నాగార్జునరెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తన తమ్ముడు పనవ్‌కుమార్‌రెడ్డికి సంబంధించి అనుకూలంగా రాయాలని రామకృష్ణను కోరగా పట్టించుకోలేదని వర్ల చెప్పుకొచ్చాడు.
అనంతర కాలంలో రామకృష్ణు విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి కోర్టుకు బదిలీ చేయడం, ఆ తర్వాత సస్పెండ్ చేశారని తెలిపాడు. సీపీఎం నేత సీతారాం ఏచూరీ చొరవతో రామకృష్ణ జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసనకు నోటీసు ఇచ్చారని తెలిపాడు. కానీ నాగార్జునరెడ్డి తన వర్గాన్ని కూడగట్టి.. అభిశంసనపై సంతకాలను కొందరు ఎంపీలు వెనక్కి తీసుకునేలా చేశారని వర్ల రామయ్య ఆరోపించాడు. పెద్దలను ఢీకొన్నందుకు రామకృష్ణ మాత్రం బలిపశువుగా మిగిలారని వర్ల చెప్పుకొచ్చాడు.
వర్ల రామయ్య చెప్పేదంతా బాగానే ఉంది. ఎనిమిదేళ్లుగా దళిత జడ్జి రామకృష్ణ నరకయాతన అనుభవిస్తుంటే…మరి అందులో తమ పార్టీ పాపం ఎంతో చెప్పాల్సిన బాధ్యత వర్ల రామయ్యకు లేదా? వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. మిగిలిన ఏడేళ్లలో ఐదేళ్ల పాటు టీడీపీనే కదా అధికారం చెలాయించింది. అంతేకాదు, కేంద్రంలో బీజేపీతో మిత్ర పక్షంగా ఉంటూ నాలుగేళ్లపాటు ఢిల్లీలో అధికారాన్ని పంచుకున్న విషయాన్ని వర్ల రామయ్య మరిచిపోయినట్టున్నాడు.
జస్జిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన తీర్మానం పెట్టించి చర్యలు తీసుకోవడంలో టీడీపీ ఎందుకు చొరప చూపలేకపోయిందో చెప్పాల్సిన బాధ్యత వర్ల రామయ్యకు లేదా? సాటి దళితుడికి అన్యాయం జరుగుతుంటే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా టీడీపీ ఉదాసీనతపై నాడు వర్ల రామయ్య ఎందుకు ప్రశ్నించలేక పోయాడు?
తగదునమ్మా అంటే ఇప్పుడు మీడియా ముందుకొచ్చి టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దళిత వేషంలో వర్ల రామయ్య ముందుకు రావడం భావ్యమా? అసలు ఎనిమిదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాడని విమర్శించడానికి నోరెలా వచ్చిందయ్యా రామయ్యా? ఈ ఆరోపణలు చేయడానికి అసలు సిగ్గనిపించలేదా?