కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే ఏపీ సీఎం జగన్ గ్రేట్ అని చెప్పక తప్పదు. ఒక వైపు కరోనా విపత్తు, మరోవైపు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ తానిచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాదు, కరోనా విపత్తుతో సంబంధం లేకుండా, ఇంత కష్టకాలంలోనూ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్య పరుస్తోంది. నిన్నటికి నిన్న వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు రూ.10 వేలు చొప్పున వాళ్ల ఖాతాల్లో జమ చేసి శభాష్ అనిపించుకున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన పథకాలు కూడా అమలు చేయవద్దని మోడీ సర్కార్ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్, గరీబ్ కల్యాణ్ యోజన మినహా మిగిలిన అన్ని పథకాలూ ఆగిపోనున్నాయి. ఈ కీలక సమాచారాన్ని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
బడ్జెట్లో ప్రకటించిన పథకాల అమలును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు శుక్రవారం వివిధ శాఖలకు పంపిన సర్క్యులర్‌లో కేంద్రం తెలిపింది. రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త పథకాలకు నిధుల కోసం ఎలాంటి అభ్యర్థనలూ పంపకూడదని కేంద్రం పేర్కొంది. నిధులను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. లాక్‌డౌన్ కారణంగా బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో కేవలం రూ.27,548 కోట్ల రాబడులు మాత్రమే వచ్చాయి. రాబడుల్లో ఇది కేవలం 1.2 శాతం మాత్రమే.
ఇప్పటికే ఆమోదించిన, అనుమతించిన పథకాలనూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. రూ.500 కోట్లలోపు ఇప్పటికే ఆమోదం పొందిన పథకాలూ నిలిచిపోనున్నాయి. జనవరిలో ఆమోదం పొంది, ఇప్పటికే కొనసా గుతున్న పథకాలు మాత్రం కొనసాగుతాయి. గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేనంతంగా జీడీపీ వృద్ధిరేటు పడిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే రకమైన ఆర్థిక పరిస్థితి రాష్ట్రాలది కూడా. మరి అలాంటప్పుడు ఏపీ సీఎం నవరత్నాల పేరుతో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని సంక్షేమ పథకాలకు ఏ మాత్రం కోత విధించకపోగా, వాటి అమలుకు సంబంధించి అది కూడా కరోనా విపత్తు సమయంలో సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి, ఎలా తెస్తున్నాడో అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
గృహమే లేకుండా ప్రజలతో గృహ ప్రవేశం చేయించిన ఘనుడు చంద్రబాబు