cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: చోక్డ్

సినిమా రివ్యూ: చోక్డ్

చిత్రం: చోక్డ్ (హిందీ)
రేటింగ్: 2.5/5
బ్యానర్:
గుడ్ బ్యాడ్ ఫిలింస్
తారాగణం: సయామీ ఖేర్, రోషన్ మాథ్యూ, అమృతా సుభాష్, రాజ్‌శ్రీ దేశ్‌పాండే తదితరులు
సంగీతం: కర్ష్ కాలే
ఛాయాగ్రహణం: సిల్వస్టర్ ఫోన్సెకా
నిర్మాతలు: అనురాగ్ కశ్యప్, ధృవ్ జగాసియా, అక్షయ్ థక్కర్
రచన: నిహిత్ భావే
దర్శకత్వం: అనురాగ్ కశ్యప్
విడుదల తేదీ: జూన్ 05, 2020
వేదిక: నెట్‌ఫ్లిక్స్ ఇండియా

సినిమా హాళ్లకు వెళ్లి సినిమా చూసే అవకాశం లేని రోజుల్లో అదృష్టంగా మారిన ‘ఓటీటీ’ వేదిక నుంచి ఈవారం విడుదలైన కొత్త భారతీయ చిత్రం ‘చోక్డ్’. విఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2016లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ‘నోట్ల రద్దు’ నేపథ్యంలో రూపొందింది. ఒక సగటు మధ్య తరగతి గృహిణికి కట్టల కొద్దీ డబ్బు అనూహ్యంగా వచ్చి పడితే, అదృష్ట లక్ష్మి వరించిందని ఆనందించే లోపే ‘నోట్ల రద్దు’ అంటూ పిడుగు పడితే ఆమె పరిస్థితి ఏమిటి? ఆ డబ్బుని ఆమె సొంతం చేసుకోగలుగుతుందా? 

ఆసక్తి కలిగించే ఈ కథాంశానికి ముంబయి మధ్య తరగతి నేపథ్యాన్ని అనురాగ్ కశ్యప్ ఎంచుకున్నాడు. ముంబయిలోని ఒక సగటు మధ్య తరగతి జీవనశైలిని కళ్లకు కట్టాడు. లీక్ అయ్యే అపార్ట్‌మెంట్లు, పక్కింటి వాళ్ల గుట్టు తెలుసుకోవాలని ఆరాటపడే మనుషులు, చాలీచాలని జీతాలు, యంత్రాల్లాంటి జీవితాలు... ముంబయి మధ్యతరగతి బ్రతుకుని ముంగిట్లోకి తెచ్చినట్టు అనిపించేంతగా దర్శకుడు అనురాగ్, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ దీనికి జీవం పోసారు. 

పొద్దున్న లేచి క్యారేజ్‌లు సర్దుకోవడంతో మొదలయి, రాత్రి గడియపెట్టి లైట్ ఆర్పి పడుకునే వరకు ఎంత రొటీన్‌గా ఎలాంటి మార్పులు లేకుండా సాగుతాయనేది షాట్ బై షాట్ రిపీట్ చేస్తూ మరీ చూపించాడు దర్శకుడు. అంతగా ఆమె (సయామీ) జీవితం గురించిన డీటెయిల్స్ అవసరమా అంటే, ఎంత నిర్లిప్తంగా ఆమె జీవితం గడుస్తోందనేది చూపిస్తే తప్ప ఆమెకి ఎదురు పడే సంఘటన, ఆమెపై దాని తాలూకు ప్రభావం తెలియదు కనుక ఆమె రొటీన్ జీవితానికి అలవాటు చేసే వరకు సమయం తీసుకుని అసలు ఘట్టానికి వెళతాడు. 

ఈ క్రమంలో రాత్రికి గానీ ఎదురు పడని భార్యాభర్తలు ఏదైనా వ్యవహారం గురించి గొడవ పడాలంటే... మధ్యలో పిల్లాడ్ని పెట్టుకుని గుసగుసలాడుతూ ఎలా గొడవపడతారు లాంటి సన్నివేశాలు దర్శకుడి నిశిత దృష్టిని తెలియజేస్తాయి. కుటుంబ భారం మోస్తోన్న భార్య, బాధ్యత తెలియని భర్త (రోషన్) నడుమ జరిగే సంభాషణలు కూడా చాలా సహజంగా వుంటాయి. అలాగే అవతలి వాళ్ల వ్యవహారంలో తల దూర్చే పొరుగింటి వాళ్లతో పాటు, మంచీ చెడ్డా చర్చించే ఒకావిడతో (అమృతా సుభాష్) కథానాయికకి వున్న అనుబంధం ఈ చిత్రానికి సహజత్వాన్ని, పాత్రలకి జీవాన్ని ఆపాదించాయి. 

ఇక నోట్ల కట్టలు ఆమె చేతికి వచ్చే సన్నివేశాల్లోని సౌండ్ ఎఫెక్ట్స్, లైటింగ్, ఆమె రియాక్షన్స్ అద్భుతంగా తెరెకక్కించారు. ఆమె చేతికి నోట్లు కట్టలు కట్టలుగా వస్తూ వుండడం, ఆమె అవీ ఇవీ కొనడం, భర్త అప్పు చెల్లించడం, దాని గురించి వారి మధ్య చర్చ జరగడం... వగైరా అంతా ఆసక్తిదాయకంగా సాగిపోతుంటుంది. ఈ కథని మలుపు తిప్పుతుందని అనుకున్న ‘నోట్ల రద్దు’ ఘట్టం వచ్చిన తర్వాత దర్శకుడు సడన్‌గా కథానాయిక ఆ డబ్బుతో పడే అగచాట్లు వగైరా చూపిస్తాడనుకుంటే, దాని వల్ల సామాన్యులు పడిన కష్టాలు, బ్యాంక్‌ల వద్ద ఏర్పడిన రద్దీలు గట్రాతో నింపేసాడు. ఆమె పాత్ర బ్యాంక్‌లో క్యాషియర్ కనుక నోట్ల మార్పిడి ఎలా చేస్తుందనేది ఆసక్తి కలిగిస్తుందనుకుంటే ఆ విషయాన్ని పక్కకి పడేసి ఎవరో మీడియేటర్ ఆమెని బ్లాక్‌మెయిల్ చేసే సన్నివేశాలకి ప్రాధాన్యం కల్పించాడు. 

అంతవరకు ఆమెతో ఓపిగ్గా, ఆసక్తిగా చేసిన ట్రావెల్ విసుగొచ్చేసేంతగా సుదీర్ఘంగా సాగే ఆమె నడకని, ఆమె దినచర్యని చూపిస్తుంటే నిట్టూర్పులు వదిలేట్టు చేస్తాడు. బ్యాంక్‌కి వచ్చిన ఒక పెద్దావిడ రోజూ రాలేనంటూ నాలుగు వేల కంటే ఎక్కువ మొత్తం ఇమ్మని చేతులు జోడిస్తే, ‘‘బ్యాంక్‌లో క్యాష్ దొరుకుతుంది. సింపతీ కాదు. ఈ చేతులు జోడించేదేదో మీరు ఓటేసిన వాళ్లకి చేయండి’’ లాంటి సున్నితమైన సెటైర్లు పండినప్పటికీ దర్శకుడు అంతవరకు చూపించిన వాస్తవికతని, ఆ పాత్రలని వదిలి తన అభిప్రాయాలు రుద్దుతోన్న భావన కలుగుతుంది. నోట్ల రద్దు నేపథ్యంలో ఒక మధ్య తరగతి బ్యాంకు ఉద్యోగిణి తన దగ్గర అకస్మాత్తుగా వచ్చి పడిన డబ్బుని దాచడానికి పడే పాట్లలో బోలెడంత థ్రిల్ ఉంది. ఈ కథకి అదే అసలైన మజిలీ కూడా. కానీ దర్శకుడు అదంతా వదిలేసి మరో రూట్లోకి వెళ్లిపోయి అంతవరకు ఆసక్తి కలిగించిన అంశాలన్నిటినీ గాలికి వదిలేసి నిరాశ కలిగిస్తాడు. 

నోట్ల రద్దు సమయంలో జనం పడిన ఇబ్బందులు, అప్పుడు పేలిన సెటైర్లు అందరికీ తెలుసు. మళ్లీ దానిని సినిమాలో చూపించాల్సిన పని లేదు. చూపించినా అదే పరమావధి అన్నట్టుగా అసలు కథను అటెకక్కించకూడదు. అయితే సాంకేతికంగా ఈ చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో రూపొందించడంలో అనురాగ్ కశ్యప్ అనుభవం అక్కరకు వచ్చింది. లో బడ్జెట్‌లో వెబ్ కోసం తీసే చిత్రాలను క్వాలిటీ తగ్గకుండా ఎలా రూపొందించవచ్చునని ఈ చిత్రం చూపిస్తుంది. ఎక్కడా ప్రమాణాల పరంగా లోటు జరగలేదు. 

ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇంతకాలం గ్లామర్ పాత్రల్లో కనిపించిన సయామీ ఖేర్ (రేయ్, స్పెషల్ ఆప్స్ ఫేమ్) ఈ చిత్రంలో మధ్య తరగతి గృహిణిగా తన ఆహార్యం, అభినయంతో ఆకట్టుకుంది. కేవలం హావభావాలే కాకుండా ఆమె నడక, రైల్లో బ్యాగ్ పట్టుకునే విధానం ఆమె ఎక్కడా నటిస్తోన్న భావన కలగనివ్వలేదు. మిగిలిన పాత్రధారులకి పెద్ద స్కోప్ లేదు కానీ రోషన్, అమృత తమ నటనతో మెప్పిస్తారు. 

చిన్న ఇంట్లో కోణకోణాన్నీ చూపిస్తూ కెమెరాతో చేసిన విన్యాసాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కాగా, డ్రెయిన్‌లో నీళ్లు ఉబికి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, ఆ సీన్స్ బాగానే థ్రిల్ ఇస్తాయి. ఒక మంచి చిత్రంగా అనురాగ్ కశ్యప్ తీసిన ఉత్తమ చిత్రాల పక్కన నిలిచిపోయే అవకాశం ఉన్న ఈ చిత్రాన్ని రాంగ్ ట్రాక్ ఎక్కించి తన కొత్త బ్యానర్ పేరుకి తగ్గట్టు ‘గుడ్ అండ్ బ్యాడ్’ సినిమాగా మిగిల్చేయడం వెలితి. థియేటర్లు వెళ్లే శ్రమ లేదు కనుక తీరిక వేళ కాలక్షేపానికి చూసేందుకు పనికొస్తుంది. 

బాటమ్ లైన్: సగంలో ‘చోక్’ అయింది!

గణేష్ రావూరి

 


×