వైసీపీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నామినేటెడ్ పోస్ట్ ల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రస్థాయితో పాటు, జిల్లా స్థాయిల్లో కూడా పదవుల పంపిణీ మొదలు కాబోతోంది. పట్టణాల్లో పాలకవర్గాలు కూడా కొలువుదీరడంతో.. పట్టణ అభివృద్ధి సంస్థల చైర్మన్ పదవులు భర్తీ చేసేందుకు కూడా మార్గం సుగమం అయింది.
అర్హులను ఎంపిక చేసే బాధ్యత ఐదుగురు రీజనల్ ఇంచార్జీలకు అప్పగించారు సీఎం జగన్. అర్హులను ఎంపిక చేసే విషయంలో జగన్ కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. జిల్లాల వారీగా నామినేటెడ్ పోస్టులకు అర్హుల జాబితాను ఇంచార్జిలు సిద్ధం చేస్తారు. వారంలోగా ఈ కసరత్తు పూర్తయితే ఆ తర్వాత సీఎం జగన్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తారు.
జగన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుంది. నామినేటెడ్ పోస్ట్ ల భర్తీలో కూడా మహిళలకు ప్రాధాన్యమివ్వాలని జగన్ సూచించినట్టు సమాచారం. 50 శాతం పదవులు మహిళలకు కేటాయించబోతున్నారట.
ఇక నమ్మకంగా పార్టీ కోసం మొదట్నుంచీ పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అర్హతలుండి, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ దక్కనివారికి రాష్ట్ర స్థాయి పదవుల్లో అవకాశం ఉంటుందని సమాచారం. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల వల్ల పోటీకి అనర్హులుగా మిగిలిపోయినవారు, మేయర్, జడ్పీ చైర్మన్ పోస్టులు ఆశించి ఇబ్బంది పడినవారికి జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఉంటుంది.
చంద్రబాబుకి జగన్ కి అదే తేడా..?
నామినేటెడ్ పదవుల్ని ఇచ్చే విషయంలో చంద్రబాబు సొంత పార్టీ నేతలకు తీవ్ర అన్యాయం చేశారు. ఎన్నికల ఏడాదిలో నామినేటెడ్ పోస్ట్ లను భర్తీ చేసి కనీసం ఆయా పోస్టుల్లో వారు కుదురుకోడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అలంకార ప్రాయంగా ఆ పోస్టులను కేటాయించి, సొంత పార్టీ నేతల్నే మోసం చేశారు బాబు.
జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. తొలి ఏడాది నుంచీ నామినేటెడ్ పోస్టులను విడతల వారీగా భర్తీ చేస్తూ వచ్చారు. సామాజిక వర్గాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లను నియమించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టులు, జిల్లాల్లో ఉన్న పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయబోతున్నారు.