ఆన్ లైన్లో ఆక్సీమీటర్ కొంటున్నారా, రీప్లేస్ మెంట్ ఆఫర్ ఉంది కదా అని పాడైపోయిన ఆక్సీమీటర్ ని సంతోషంగా తిరిగిచ్చేస్తున్నారా…? అయితే ఒక్క నిమిషం ఆగండి, ఈ సమాచారం మీ కోసమే.
ఆక్సీమీటర్ స్కామ్ ద్వారా వినియోగదారుల సమాచారం మొత్తం కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మన వేలిముద్రల్ని మనంతట మనమే వారికి అప్పనంగా అప్పగిస్తున్నాం. సైబర్ మోసాల వలలో ఇరుక్కుపోతున్నాం.
మోసం ఎలా జరుగుతుందంటే..?
ఆన్ లైన్లో అతి తక్కువ ధరకే ఆక్సీమీటర్, పైపెచ్చు రీప్లేస్ మెంట్ వారంటీ అంటూ ప్రకటనలిస్తున్న సైబర్ మోసగాళ్లు.. సులభంగా వినియోగదారుల్ని బుట్టలో వేసుకుంటున్నారు. ఇలాంటి ఆక్సీమీటర్లలో ఓ మైక్రో చిప్ అమర్చి, వేలిముద్రల డేటా అందులో నిక్షిప్తం అయ్యేలా చేస్తారు. నాసిరకం ఆక్సీమీటర్ ఎలాగూ 15, లేదా 20 రోజుల తర్వాత పనిచేయదు. రీప్లేస్ మెంట్ ఆఫర్ ఉంది కాబట్టి.. కంపెనీవాళ్లకి ఫోన్ చేసి, కొత్తది తీసుకురావాలని అడుగుతారు కస్టమర్లు.
దీంతో సదరు కంపెనీ ప్రతినిధి వచ్చి పాత ఆక్సీమీటర్ తీసుకుని కొత్తది ఇచ్చి వెళ్తాడు. దానిలోని చిప్ తీసుకుని, వేలిముద్రల డేటా అంతా కాపీ చేసుకుంటారు. వేలిముద్రలను ఆధార్ తో అనుసంధానం చేసి, మన బ్యాంక్ వివరాలు తెలుసుకుంటారు. మన ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి ఆన్ లైన్ మోసాలకు పాల్పడతారు.
ఇటీవల కాలంలో ఇలా ఆక్సీమీటర్లు తిరిగిచ్చేసిన కొంతమంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు మాయమైన ఘటనలు జరిగాయి.. అయితే అధికారికంగా ఎక్కడా కేసులు నమోదు కాలేదు. ఆక్సీ మీటర్లో సెల్ ఫోన్ మెమరీ కార్డులాంటి చిప్ లను మనం గమనించలేం.
కరోనా కాలంలో వెలుగులోకి వస్తున్న ఇలాంటి కొత్త తరహా మోసాల్లో… ఆక్సీమీటర్ల స్కామ్ కూడా ఒకటి. మొన్నటివరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పేరిట ఆన్ లైన్ లో జరిగిన మోసాలు చూశాం.. ఇప్పుడీ సైబర్ మోసాలు ఆక్సీమీటర్లకు కూడా విస్తరించాయి.