పేదలకు ఇళ్లు దక్కకుండా చేశామని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంతోషిస్తూ వుండొచ్చు. ఈ క్రమంలో తన పార్టీ కొంప కూల్చు కుంటున్న ప్రమాదాన్ని టీడీపీ గ్రహించినట్టు లేదు. జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయంపై టీడీపీ తన మనుషులతో న్యాయస్థానంలో పిల్ వేయిస్తున్న సంగతి దాస్తే దాగేది కాదు. ఇళ్ల పథకంపై కూడా అలాంటిదే వేయించారు. కానీ తమకు అనుకూలంగా, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని టీడీపీ సంబరపడడం అంటే…ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు.
జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పథకానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కానీ వ్యక్తిగతంగా వైఎస్ జగన్ నెత్తిన పాలు పోశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం విశేషం. ఇళ్ల నిర్మాణ హామీని నెరవేర్చే క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో జగన్ ప్రభుత్వం తలకిందులవుతోంది. మరోవైపు లబ్ధిదారుల్లో అసహనం, ఆగ్రహం. ఈ నేపథ్యంలో ఇళ్ల పథకాన్ని నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు…. సాంకేతికంగా ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బే. కానీ రాజకీయ కోణంలో చూస్తే మాత్రం జగన్కు ఇది ఎంతో ప్రయోజనం కలిగించినట్టైంది.
పేదలకు ఇళ్లు అందకుండా న్యాయస్థానం ద్వారా ప్రధాన ప్రతిపక్షం అడ్డుకుందని టీడీపీని దోషిగా నిలబెట్టేందుకు అధికార పక్షా నికి చిక్కిన వజ్రాయుధంగా ఈ తీర్పును రాజకీయంగా మలుచుకునే అవకాశం ఉంది. ఇదే న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా ఉంటే, ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేక పేదల దృష్టిలో ప్రభుత్వం దోషిగా నిలిచేది. ఇది టీడీపీకి రాజకీయంగా లాభించేది. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పుతో అంతా రివర్స్ అయ్యింది. దీంతో వైసీపీ ప్రభుత్వం లోలోన ఖుషీ అవుతూ వుంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పేదలందరికీ ఇళ్లు పథకం కింద 25 లక్షల ఇళ్ల స్థలాలు/హౌసింగ్ యూనిట్లు ఇచ్చేందుకు జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది డిసెంబరులో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు.
పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించి నివేదిక ఇచ్చింతే వరకూ ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తగినంత స్థలం లేకపోతే.. జరిగే దుష్పరి ణామాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలను పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఇరుకైన ఇళ్లలో నివాసం వ్యక్తుల పురోభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని జడ్జి సత్యనారాయణమూర్తి ఆదేశించారు. మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలన్నారు. ఆ తర్వాతే ఈ పథకాన్ని ఖరారు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
కమిటీ నివేదిక ఆధారంగా అదనపు భూమి కొని, స్థలం విస్తీర్ణం పెంచి, లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్లను సవరించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ముగిసేవరకూ ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చిచెప్పారు.
ఒకవైపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు, మరోవైపు నిర్దేశించిన బడ్జెట్ సరిపోక సంబంధిత అధికారులు ముందుకెళ్లలేని పరిస్థితుల్లో తాజాగా హైకోర్టు తీర్పు కొండంత రిలీఫ్. కోర్టు ఆదేశాలు అమలుకు నోచుకునే సరికి మళ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తాయనడంలో అనుమానం లేదు.
అంత వరకూ పేదలకు కనీస సౌకర్యమైన గూడు దక్కకుండా అడ్డుకున్న పార్టీగా టీడీపీ తప్పక ప్రజాకోర్టులో దోషి కాక తప్పదు. పేదలకు ఇళ్లు ఇవ్వాలనుకున్న పాలకుడిగా జగన్, అడ్డుకున్న ద్రోహిగా చంద్రబాబును ప్రజలు గుర్తించుకుంటారు. రాజకీయంగా ఇది టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పడం అందుకే. ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నంలో టీడీపీ చేసిన చరిత్రాత్మక తప్పిదమని అభివర్ణించవచ్చు.