‘మా’ ఎన్నికల్లో సీనియర్ నటుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. రోజుకొక ట్విస్ట్ ఇస్తూ…‘మా’ సభ్యులకు అసహనం తెప్పిస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని విమర్శిస్తున్నారు. ‘మా’ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక ప్రకటనతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. తాజాగా ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
మొట్ట మొదట ‘మా’ అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించి అందరి దృష్టిని తన వైపు మళ్లించుకున్నారు. కొన్ని రోజుల పాటు తన పేరుపై చర్చ జరిగేట్టు చూసుకున్నారు. ఆ తర్వాత నామినేషన్ వేశారు. మ్యానిఫెస్టో విడుదల చేశారు. తర్వాత గంటల వ్యవధిలోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇరు ప్యానళ్లలోని తెలంగాణ కళాకారులను గెలిపించాలని కోరారు.
ఆ తర్వాత ప్రకాశ్‌రాజ్‌ను ఓడించాలని పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ హిందువుల వ్యతిరేకి, దైవం, ధర్మం అంటే గౌరవం లేదని ఘాటుగా విమర్శించారు. ఆ తర్వాత తనకు దాసరి నారాయణరావు కలలోకి వచ్చి… ఏకగ్రీవం అయ్యేలా ప్రయత్నించాలని ఆదేశించినట్టు చెప్పుకొచ్చారు. ఇదేదో కొందరికి వెటకారంగా ఉండొచ్చని ఆయనే ప్రకటించారు. ఇది అయిపోయిందని అనుకునే లోపే మరో బాంబు పేల్చారు.
ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు తాను చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ‘మా’ సభ్యత్వానికీ, బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించి సంచలనం సృష్టించారు. పరీక్షరాయకముందే తాను ఫెయిల్ అయ్యినట్టు ప్రకటించడం గమనార్హం.
రాజీనామాకు ముందు ఆయన ప్రస్తావించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ ఇలాంటి గందరగోళ, ఇబ్బందికర, దరిద్రమైన పరిస్థితులకి నేనూ దోహదం చేశాను కాబట్టి ఇకపై ఓటు వేయను’ అని అన్నారు. కాసేపటికే రాజీనామా చేశారు. ‘మా’ సభ్యత్వా నికి సరే, బీజేపీకి రాజీనామా ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి.