“మా” ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరింది. ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇరు వైపులా పలువురు సెలబ్రిటీలు మోహరించి ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో, వేయకూడదో సోషల్ మీడియా వేదికగా చెబుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ప్రకాశ్‌రాజ్ తరపున బలమైన వాయిస్ వినిపించారు.
ఈ దఫా మంచు విష్ణుపై విమర్శల తీవ్రత పెంచారు. 7.21 నిమిషాల నిడివి గల వీడియోలో నాగబాబు గతంలో ఎన్నడూ లేనంత క్లారిటీతో మాట్లాడారు. మంచు విష్ణుపై నాగబాబు చేసిన తీవ్ర విమర్శలను వింటే…చాకిరేవు పెట్టారనే మాట సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
“మాకు కొన్ని సందేహాలున్నాయి. మాకు అంటే మాకు కాదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకి. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదనే సందేహాలు. వాటి గురించి పారదర్శకంగా మాట్లాడుకుందాం” అంటూ నాగబాబు కూల్‌గా మొదలు పెట్టి హాట్‌హాట్‌గా ముగించారు. ముఖ్యంగా మంచు విష్ణు అర్హతల గురించి ఆయన ప్రశ్నించిన తీరు ఆకట్టుకుంటోంది.
“ఇప్పుడు మంచు విష్ణుకి ఎందుకు ఓటు వేయాలో మాట్లాడుకుందాం. మోహన్‌బాబు గారి అబ్బాయి, ఇండస్ట్రీలో పుట్టిన మనిషి. వాళ్ల నాన్నగారు 500 సినిమాల్లో యాక్ట్ చేశారు. 50 సినిమాలు నిర్మించారు. ఒక విద్యాసంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా?”
“ప్రకాశ్‌రాజ్‌కు ఎందుకు ఓటు వేయకూడదని అనుకుంటున్నారో అది కూడా తెలుసుకుందాం. ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్, ప్రొడ్యూ సర్స్‌తో వివాదాలు. ఎవరు చెప్పినా అటుతిప్పి, ఇటు తిప్పి ఫైనల్‌గా చెప్పేది ఈ రెండే”
“మంచు విష్ణుకు ఓటు ఎందుకు వేయకూడదో మాట్లాడుకుందాం. ప్రకాశ్‌రాజ్‌కు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏవీ కూడా విష్ణుకు లేవు. వాళ్ల నాన్న మోహన్‌బాబు గారికి ఉన్నాయి. కానీ నిలబడింది వాళ్ల నాన్న గారు కాదుగా. విద్యాసంస్థను రన్ చేస్తున్నా మంటే విద్యార్థులకు ఏం కావాలో తెలుస్తుంది. కానీ ఆర్టిస్టులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన వాడికంటే ఎక్కువ తెలియదు కదా! ప్రకాశ్‌రాజ్‌కి ప్రొడ్యూసర్స్‌తో కాంట్రవర్సీలున్నాయి. మీకు లేవా?
సైలెంట్ సినిమా విషయంలో వైవీఎస్ చౌదరితో రెమ్యునరేషన్ విషయంలో మీరు ప్రాడ్ చేశారని కోర్టుకెళ్లింది నిజం కాదా? కోర్టు మీకు మొట్టికాయలు వేసిందని తెలుగు వాళ్లకు తెలియదా? ఒక స్టార్ డైరెక్టర్‌కే ఆ గతి పట్టించారంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అతను కాబట్టి కోర్టుకెక్కి నిలబడ గలిగాడు. ఎదురు తిరగలేక ఏడుస్తూ వెళ్లిపోయిన వాళ్లు ఎంత మంది ఉన్నారో అని మేము అంటే… మీ కాంట్రవర్సీలో తప్పు ఎవరిదో మాకు తెలియదు, అలాగే ప్రకాశ్‌రాజ్ కాంట్రవర్సీలో తప్పు ఎవరిదో మీకు తెలియదు. కాబట్టి కాంట్రవర్సీల విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి”
“ఇక నాన్‌లోకల్. ఇదొక్కటేగా గట్టిగా పట్టుకున్నారు. నాకు ఒక్కటి చెప్పండి. ప్రకాశ్‌రాజ్ 25 ఏళ్లుగా ఏడాదిలో 25 సినిమాల్లో నటించాడు. నువ్వు 25 సినిమాల్లో నటించావు. మన విశాల్‌ను వాళ్లు ఒప్పుకున్నారు కదయ్యా అని అంటే…విష్ణు ఏమన్నావ్?
అతని తల్లితండ్రులు తెలుగు వాళ్లు. కానీ అతను తమిళవాడు అన్నావు. అక్కడే పుట్టాడు కాబట్టి తమిళవాడైతే … స్ట్రయిట్‌గా అడుగుతున్నా…నువ్వెవరివి? ఎక్కడ పుట్టావు? మద్రాస్‌లో పుట్టావ్. అక్కడే చదువుకున్నావు. మీ అమ్మ, నాన్న మాత్రమే తెలుగు వాళ్లు. నువ్వు తమిళ వాడివని అనాల్సి వస్తుంది. అసలు ప్రకాశ్‌రాజ్, నువ్వు కలిసి తెలుగు పరీక్ష రాస్తే ప్రకాశ్‌రాజ్‌కి 90 మార్కులొస్తే, నీకు పాసు మార్కులు కూడా రావు. మీ ఇద్దర్ని సినిమాలు చూడని వాళ్ల దగ్గర తెలుగు మాట్లాడిస్తే… ప్రకాశ్‌రాజ్‌ని తెలుగోడు అంటారు. నిన్ను తెలుగు నేర్చుకోమంటారు”
ఇలా మంచు విష్ణుపై నాగబాబు మాటల దాడి చేశారు. ఇటీవల మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబాన్ని లాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్, హేమ, శ్రీకాంత్‌లకు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి తన కుటుంబ సభ్యుల్ని లాగితే మర్యాద దక్కదంటూ పేర్లు పెట్టి మరీ హెచ్చరించారు.
ఇప్పుడు నాగబాబు చేసిందేంటి? మంచు విష్ణు ఉనికినే నాగబాబు ప్రశ్నించారు. విష్ణు స్థానికతపై నిలదీశారు. నీ తల్లిదండ్రులు తెలుగు వాళ్లని, నువ్వు కాదని తేల్చి చెప్పారు. నీకు తెలుగులో కనీసం పాసు మార్కులు కూడా రావని ఎద్దేవా చేశారు. మరి జీవిత, శ్రీకాంత్, హేమలను హెచ్చరించినట్టు నాగబాబును కూడా హెచ్చరించే దమ్ము, ధైర్యం మంచు విష్ణుకు ఉన్నాయా? అని నెటిజన్స్ నిలదీస్తున్నారు. తమతో అన్ని విధాలా సమానులైన వ్యక్తులను ఢీకొనే సత్తా విష్ణుకు ఉందా? అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? కమాన్ విష్ణు…రెచ్చిపోతావా? రాజీపడతావా?