పారదర్శకతే లక్ష్యం.. జగన్ మరో కీలక నిర్ణయం

గతంలో కేవలం వాటర్ బాటిల్స్ కే కోట్లు తగలేశారు చంద్రబాబు. అవసరం ఉన్నా లేకున్నా సభలు పెట్టి వేదికపై ఏసీలకే లక్షల్లో బిల్లులు పెట్టారు. ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ లక్షల్లో అద్దెలు చెల్లించి…

గతంలో కేవలం వాటర్ బాటిల్స్ కే కోట్లు తగలేశారు చంద్రబాబు. అవసరం ఉన్నా లేకున్నా సభలు పెట్టి వేదికపై ఏసీలకే లక్షల్లో బిల్లులు పెట్టారు. ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ లక్షల్లో అద్దెలు చెల్లించి ప్రైవేటు వాహనాలు తెచ్చుకున్నారు అప్పటి మంత్రులు. చివరికి రాజధాని పేరిట జరిగిన అక్రమాల్లో జిరాక్సులు, మెయింటెనెన్స్ ఖర్చుల కింద కోట్ల రూపాయలు చూపించిన అమాత్యులు ఉన్నారు. ఇలా ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుచేశారు. ఇకపై అలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని నిర్ణయించారు సీఎం జగన్. దీనికి సంబంధించి ఇప్పటికే  ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వానికి సంబంధించి కోటి రూపాయలు దాటిన ఏ ఖర్చు అయినా వెబ్ సైట్ లో పెట్టాలని నిర్ణయించారు జగన్. ప్రజాధనాన్ని ఖర్చు చేసే విషయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, కాబట్టి కోటి రూపాయలు దాటిన ప్రతి ఖర్చుకు వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశించారు. అమెరికా పర్యటనకు ముందే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం, ఇప్పుడు అమల్లోకి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలకు ఈ నియమం వర్తిస్తుంది.

కేవలం ఖర్చులు మాత్రమేకాదు, కొనుగోళ్లకు కూడా ఇదే పద్ధతి అనుసరించబోతున్నారు. ప్రభుత్వ శాఖల్లో కోటి దాటి ఏ కొనుగోలు చేయాలనుకున్నా ఆ వివరాల్ని వెబ్ సైట్ లో పెడతారు. ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నారో కూడా అందులో పొందుపరుస్తారు. అంతకంటే తక్కువకు వేరేవాళ్లు ఎవరైనా కోట్ చేస్తే, అధికారులు పెట్టిన టెండర్ ఆటోమేటిగ్గా రద్దవుతుంది. రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ లో భాగంగా తక్కువకు కోట్ చేసిన వ్యక్తులకే టెండర్ దక్కుతుందన్నమాట. ఇలా ఎక్కడికక్కడ ప్రభుత్వ ధనం వృధాను అరికట్టాలని జగన్ నిర్ణయించారు.

అవినీతిరహిత పాలనను అందిస్తానని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి, ఆ దిశగా అందివస్తున్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టు అంశాల్లో రివర్స్ టెండరింగ్ కు శ్రీకారం చుట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేస్తున్న  సీఎం, ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుల్లో కూడా ఇలా పారదర్శకత తీసుకురావాలని నిర్ణయించారు.

జగన్ చేపడుతున్న ఈ చర్యలన్నీ ఉన్నఫలంగా సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ రాబోయే కాలంలో ప్రభుత్వ శాఖల్లో ఇవి ఓ మంచి వాతావరణాన్ని కచ్చితంగా కల్పిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తిగా కాకపోయినా అవినీతి సగానికి సగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. జగన్ కోరుకున్నది కూడా ఇదే.

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!