ఒక దళిత మంత్రి, దళిత ఎంపీ, అలాగే మరో దళిత సలహాదారుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఘటన ఇది. దీనికి ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ నియామకమే కారణంగా తెలుస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎస్సీ కమిషన్ చైర్మన్ నియామకం వేచి చూస్తూ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా నాలుగు దశాబ్దాల పాటు దళిత హక్కుల కోసం ఉద్యమిస్తున్న మారుమూడి విక్టర్ ప్రసాద్ నియామకానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే విక్టర్ ప్రసాద్ అంటే వ్యక్తిగతంగా గిట్టని దళిత త్రిమూర్తులు ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఆ దళిత త్రిమూర్తుల్లో ఒక మంత్రి, టీడీపీ హయాంలో ఓ కార్పొరేషన్ పదవిలో ఉంటూ జగన్‌ను నానా తిట్లు తిట్టిన సదరు మంత్రి జిల్లాకే చెందిన దళిత నాయకుడు, అలాగే జగన్ వెనుక నిలిచి ఫొటోకు దిగితే చాలు..జీవితం ధన్యమంటూ ఏకంగా ఎంపీ అయిపోయిన నాయకుడు ఉన్నారు.
కీలకమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని విక్టర్‌కు కట్టబెట్టొద్దని సదరు దళిత త్రిమూర్తులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికే విక్టర్ ప్రసాద్‌కు మాట ఇచ్చానని, ఇక ఆ విషయం గురించి మాట్లాడొద్దని సున్నితంగా చెప్పి పంపారు. అయితే విక్టర్‌కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాన్ని వారు విరమించుకోలేదు. తమ వాళ్లకు రాకపోయినా ఫర్వాలేదు, తమకు గిట్టని వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ కీలక పదవి దక్కనీయవద్దనేది వారి కుట్ర.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మరోసారి సీఎంను కలిసి … విక్టర్ ప్రసాద్‌ను ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేయొద్దని గట్టిగా కోరారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైనట్టు సమాచారం. దళిత హక్కుల కోసం పోరాడే విక్టర్ ఎక్కడ? పదవుల కోసం వెంపర్లాడే మీరెక్కడ? అనే అర్థం ధ్వనించేలా నిలదీసినట్టు తెలిసింది. అంతేకాదు, ఇక మీదట ఆ విషయమై మాట్లాడేందుకు వస్తే మర్యాదుండదని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం.