2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ విజయ దుందుభి మోగించి సొంతంగా 55.8శాతం ఓట్లతో 303 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 52 సీట్లతో అతి దారుణ పరాభవ భారాన్ని మూటగట్టుకుంది. ఏపీలో కూడా సేమ్ టు సేమ్ పరిస్థితి. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్లో భారీ మెజార్టీ సాధించిన వైసీపీ ప్రతిపక్ష టీడీపీని కేవలం 23 స్థానాలకే పరిమితం చేసింది. ఒక రకంగా కేంద్రంలో కాంగ్రెస్ కి వచ్చిన సీట్ల శాతం కంటే.. ఏపీలో టీడీపీకి వచ్చిన పర్సెంటేజే ఎక్కువ. ఒకవేళ ప్రతిపక్షాలను లెక్కచేయాల్సిన సందర్భమే వస్తే.. బీజేపీ కాంగ్రెస్ ని పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ వైసీపీ టీడీపీని లక్ష్యపెట్టాల్సిందే. అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయింది.
కేంద్రంలో పూర్తిస్థాయి మెజార్టీలో ఉన్న బీజేపీ కూడా కాంగ్రెస్ ని చూసి వణికిపోతోంది. కాంగ్రెస్ చేసిన ప్రతి విమర్శకీ సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. వలస కార్మికుల కష్టాలైనా, కరోనా కష్టకాలంలో చేసిన సాయమైనా, చైనాతో యుద్ధమైనా, పెట్రోల్ ధరలైనా… అన్నింటిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉంది కాంగ్రెస్. కాంగ్రెస్ గొప్పతనాన్ని మెచ్చుకోలేం కానీ, బీజేపీ భయం మాత్రం ఇక్కడ సుస్పష్టం. ప్రధాని మోడీ, పార్టీ పెద్దలు నడ్డా, అమిత్ షా.. మిగతా మంత్రులు కూడా కాంగ్రెస్ విమర్శలకు బదులు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు.
ఇక ఏపీ విషయానికొస్తే.. టీడీపీని పూర్తిగా చాప చుట్టేశారు సీఎం జగన్. అనుకూల మీడియా సాయంతో చంద్రబాబు రెచ్చిపోతున్నా.. జగన్ అసలు ఆయన్ని కేర్ చేయడం లేదు. అభివృద్ధి పథకాల అమలులో ఒకటీ రెండుసార్లు టీడీపీని విమర్శించారు కానీ, నేరుగా ఎప్పుడూ ఆ పార్టీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిందే లేదు. టీడీపీ అంచనాల కంటే ఎక్కువగా జగన్ పనిచేసుకుంటూ వెళ్తున్నారు.
జగన్ చేసిన, చేస్తున్న పనులే ప్రతిపక్షాలకు సౌండ్ లేకుండా చేస్తున్నాయి. అందుకే వారి అవాకుల్ని, చెవాకుల్ని సీఎం జగన్ పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల వ్యవధి ఉన్నా.. ఏడాదిలోనే రాజన్న రాజ్యం ఎలా ఉంటుందో శాంపిల్ చూపించేశారు. ఒకరకంగా ఏపీలో ప్రతిపక్షాలు జీవచ్ఛవాలుగా మారాయి. 2024 ఎన్నికలపై కూడా వాటికి ఏమాత్రం హోప్ లేదు.
అయితే కేంద్రంలో బలం ఉండి కూడా బీజేపీ ఎందుకో తటపటాయిస్తోంది. కాంగ్రెస్ ని అతి పెద్ద పార్టీగా భావించి తప్పటడుగులు వేస్తోంది. బీజేపీ నేతలు కానీ, కేంద్ర మంత్రులు కానీ కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నాయకులకు, వారి విమర్శలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే బీజేపీ స్వయంకృతాపరాధాలే వారిలో భయానికి కారణాలు. దేశంలో పరిస్థితులన్నీ బాగున్నాయంటూ లేనిపోని డాంబికాలు ప్రదర్శించడం, వాస్తవాలను కప్పిపుచ్చాలని చూడటం.. బీజేపీ చేసిన తప్పులు.
అందుకే మెజార్టీ ఉన్నా కూడా బీజేపీ భయపడుతోంది. పార్టీలో అసమ్మతి లేకుండా అణచివేయగల సామర్థ్యం ఉన్న మోడీ.. ఎందుకో కాంగ్రెస్ విమర్శలకు మాత్రం భయపడిపోతున్నారు, బదులు చెప్పేందుకు, చెప్పించేందుకు ఇబ్బంది పడిపోతున్నారు. ప్రజల్నే నమ్ముకున్న జగన్ ప్రతిపక్షాల్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. జగన్ కి ఉన్నపాటి ధైర్యం కూడా బీజేపీ నేతలకు లేనట్టుంది.